ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు- 2014 ప్రతులను బుధవారం ఉదయం లోక్‌సభ సభ్యులకు అధికారులు పంపిణీ చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు- 2014 ప్రతులను బుధవారం ఉదయం లోక్‌సభ సభ్యులకు అధికారులు పంపిణీ చేశారు. తొలుత రాష్ట్రపతి ఆమోదం పొంది అసెంబ్లీ అభిప్రాయం కోసం వెళ్లిన బిల్లును యథాతథంగా ఉంచారు. అదనంగా ఫైనాన్షియల్ మెమోరాండం జతపరిచినప్పటికీ.. అందులో స్పష్టత లేదు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే కేంద్ర ఖజానాకు ఎంత ఖర్చవుతుందన్న అంశం ఈ ఫైనాన్షియల్ మెమోరాండంలో ఉండాలి.
కానీ కేవలం ఆర్థిక సంఘం అంచనాల అనంతరమే ఆర్థిక సహాయం ఉంటుందని ఈ ఫైనాన్షియల్ మెమోరాండంలో పేర్కొన్నారు. 13వ ఆర్థిక కమిషన్ కేటాయించిన నిధులను జనాభా, ఇతర అంశాల ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు కేటాయిస్తామని బిల్లులోని 47వ క్లాజులో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు కావాల్సిన నిధులు అంచనా వేస్తామని 95వ క్లాజులో పేర్కొన్నారు. కొన్ని శాఖలు, విభాగాల నిర్వహణకు కొద్దిపాటి పెంపు తప్ప సంచిత నిధినుంచి అదనపు వ్యయమేదీ ఉండదని అందులో తెలిపారు.