వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు | Fan common symbol allotted to YSR Congress | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు

Dec 19 2013 1:47 AM | Updated on May 25 2018 9:12 PM

వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు - Sakshi

వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్‌గా (ఎన్నికల చిహ్నంగా) సీలింగ్ ఫ్యాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది.

కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్‌గా (ఎన్నికల చిహ్నంగా) సీలింగ్ ఫ్యాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ, ఆ తర్వాత అదే గుర్తుపై రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలను ఎదుర్కొంది. 2011 మేలో కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ‘సీలింగ్ ఫ్యాన్’ గుర్తుతోనే రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించడం తెలిసిందే. తర్వాత 2012 మార్చిలోనూ, జూన్‌లోనూ జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభతో పాటు 16 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సీలింగ్ ఫ్యాన్ గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు. 
 
 తర్వాత పార్టీ ప్రమేయం లేని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికల్లో కామన్ సింబల్‌గా సీలింగ్ ఫ్యాన్ గుర్తునే కేటాయించాలని కోరుతూ డిసెంబర్ 1న, 3న పార్టీ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ ఈసీకి వేర్వేరుగా లేఖలు రాశారు. ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్-1968 ప్రకారం వైఎస్సార్‌సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తును ఈసీ కేటాయించింది. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ, 294 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు దీన్నే ఉమ్మడి గుర్తుగా కేటాయిస్తారు. ఈ మేరకు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి ఈసీ సమాచారం పంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement