సల్మాన్ బెయిల్... ఈరోస్ షేర్లు గెయిన్
సల్మాన్ కు బెయిల్ రావడంతో ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా కంపెనీ షేర్లు పైకి లేచాయి.
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు బెయిల్ రావడంతో ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా కంపెనీ షేర్లు పైకి లేచాయి. బీఎస్ ఈలో ఈరోస్ షేరు 4.29 శాతం పెరిగి రూ. 402 వద్ద స్థిరపడింది. నిఫ్టీలోనూ 4.31 శాతం పెరిగి రూ.403కు చేరుకుంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ జైలుశిక్ష పడడంతో బుధవారం ఈరోస్ షేర్లు భారీగా నష్టపోయాయి. బాంబే హైకోర్టు అతడికి బెయిల్ ఇవ్వడంతో మళ్లీ పుంజుకున్నాయి.
సల్మాన్ లో రెండు సినిమాలు నిర్మించనున్నట్టు గతేడాది డిసెంబర్ లో ఈరోస్ సంస్థ ప్రకటించింది. 'బజరంగీ భాయ్ జాన్', 'హీరో' సినిమాలు నిర్మించనున్నట్టు తెలిపింది. మరోవైపు వరుస నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్ నేడు కోలుకుంది. సెన్సెక్స్ 506, నిఫ్టీ 134 పాయింట్లు లాభపడ్డాయి.


