అమితాబ్‌కు స్ఫూర్తినిచ్చిందీ ఆ డాన్సరే! | Ekk Albela is biopic on Bhagwan Dada, India's first dancing superstar | Sakshi
Sakshi News home page

అమితాబ్‌కు స్ఫూర్తినిచ్చిందీ ఆ డాన్సరే!

Jun 27 2016 8:06 PM | Updated on Sep 4 2017 3:33 AM

అమితాబ్‌కు స్ఫూర్తినిచ్చిందీ ఆ డాన్సరే!

అమితాబ్‌కు స్ఫూర్తినిచ్చిందీ ఆ డాన్సరే!

బాలీవుడ్‌లో బిగ్ బీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ఇరగదీసి డాన్స్ చేయకపోయినా, మూడు నాలుగు స్టెప్పులతో ఆయన చేసే డాన్స్ ముచ్చటగా ఉంటుందనే విషయం మనకు తెల్సిందే.

ముంబై: బాలీవుడ్‌లో బిగ్ బీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ఇరగదీసి డాన్స్ చేయకపోయినా, మూడు నాలుగు స్టెప్పులతో ఆయన చేసే డాన్స్ ముచ్చటగా ఉంటుందనే విషయం మనకు తెల్సిందే. అలాగే డిస్కో డాన్సర్ ద్వారా అప్పటి యూత్‌ను ఉర్రూతలూగించిన మిథున్ చక్రవర్తి, ఆ తర్వాత బాలివుడ్ సినిమాల్లో మంచి డాన్సర్‌గా గుర్తింపు పొందిన గోవింద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముగ్గురు కూడా ఒకే వ్యక్తి చేసిన డాన్స్‌లను స్ఫూర్తి పొందారని, ఆ వ్యక్తి స్టెప్పులనే అనుకరించారనే విషయాన్ని విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

ఆయనే తొలితరం హీరో కమ్ డాన్సర్, కమ్ మ్యూజిక్ డెరైక్టర్ కమ్ సినిమా డెరైక్టర్ భగవాన్ దాదా. ఆయన అసలు పేరు భగవాన్ అబ్బాజీ పాలవ్. మహారాష్ట్రలోని అమ్రావటిలో 1913లో జన్మించిన భగవాన్ తొలుత ముంబలో మిల్లు కార్మికుడిగా పనిచేశారు. భారత మౌఖిక సినిమాల యుగంలో బాలివుడ్‌లో అడుగుపెట్టారు. ‘క్రిమినల్’ అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందారు. డాన్స్ అంటే ఆడవాళ్లు చేసేదే డాన్స్ అన్న ముద్ర ఉన్న నాటి రోజుల్లో డాన్స్ ద్వారా తొలి అద్భుతమైన మేల్ డాన్సర్‌గా గుర్తింపు పొందారు.

1938లో బహదూర్ కిసాన్ అనే సినిమాకు కో డెరైక్టర్‌గా పనిచేసి డెరైక్షన్ రంగంలో కూడా రాణించారు. ఎంకే రాధా, తవమణి దేవి నటించిన ‘వన మోహిని’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ వన మోహిని చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అవడమే కాకుండా భారత సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. ఆ సినిమాలో హీరోయిన్ తవమణి దేవి తన దుస్తులు తానే ఎంపిక చేసుకోవడంతోపాటు తన మేకప్ తానే వేసుకోవడం కూడా ఓ ప్రత్యేకతని అప్పడే కాకుండా ఇప్పటికీ చెప్పుకుంటారు.

సినీ రంగంలోకి మాట, పాట వచ్చిన తర్వాత అనేక హిందీ చిత్రాల్లో నటించి, దర్శకత్వం వహించిన దాదాకు ‘అల్బెలా’ చిత్రం సూపర్ డూపర్ హిట్‌తో ఊహించని పేరు వచ్చింది. దాదా, గీతాబాలి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మించిందీ, దర్శకత్వం వహించిందీ భగవాన్ దాదే. ఇందులోని పాటల ద్వారానే ఈ సినిమా సూపర్ హిట్టయిందని చెప్పవచ్చు.

అధికారికంగా ఈ చిత్రానికి సీ. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించినప్పటికీ ఆయన రిక్వెస్ట్‌పై కొన్ని పాటలకు దాదానే సంగీతం సమకూర్చారు. ఆ సినిమాతో డబ్బు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడడంతో అప్పటి నుంచి దాదాపు జీవన శైలీ మారిపోయింది. ఎవరికి లేనంత మంది మిత్రులు, పరిచయస్థులు, బంధువులు ఆయన చుట్టూ మూగారు. ముంబై సముద్రం ఒడ్డున ఏకంగా 25 గదుల పెద్ద బంగళానే కొన్నారు. బంగళాలో ఏడు గ్యారే జీలను ఏర్పాటు చేసుకొని ఏడు ఖరీదైన కార్లను కొన్నారు.

రోజుకో కారులో తిరిగేవారు. ఆ తర్వాత వచ్చిన ‘జమేలా, లాబెలా’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కుప్పకూలడంతో భారీ నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ఏ సినిమాలు కూడా పెద్దగా నడవకపోవడంతో ఆయన డబ్బంతా హారతి కర్పూరంలా కరగిపోయింది. సీ. రామచంద్ర, ఓంప్రకాష్, పాటల రచయిత రాజేంద్ర క్రిషణ్ లాంటి మిత్రులు కూడా ఆదుకోకపోవడంతో రోడ్డున పడ్డారు. ముంబై దాద్రా ప్రాంతంలో కార్మికులు నివసించే చిన్న డబ్బాలాంటి రేకుల ఇంటికి మారిపోయారు. తన 89వ ఏట 2002లో కన్నుమూశారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎక్ అల్బెలా’ పేరుతో తీసిన మరాఠి చిత్రం ఇప్పుడు మహారాష్ట్రలో విడుదలైంది. దాన్ని హిందీలోకి డబ్ చేయాలనే ఆలోచన కూడా నిర్మాతలకు ఉన్నట్లు వార్తలొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement