
కేజ్రీవాల్‌పై కేసు పెట్టండి: ఈసీ
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది..
న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్నికల సంఘం(ఈసీ) కొరడా ఝుళిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడమేకాక, హెచ్చరికలను సైతం ఖాతరుచేయని ఆయనపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదివారం ఆదేశాలు జారీచేసింది. కేజ్రీవాల్‌పై కేసు పెట్టి, ఆ ఎఫ్‌ఐఆర్ కాపీని జనవరి 31(మంగళవారం) సాయంత్రం 3 గంటలలోగా తనకు పంపాలని సంబంధిత అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
జనవరి 8న గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అరవింద్ కేజ్రీవాల్.. ‘ప్రత్యర్థి పార్టీలు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వెయ్యండి’ అని ఓటర్లకు సలహా ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు.. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు జారీచేసింది. జనవరి 19న ఈసీకి వివరణ ఇవ్వాల్సి ఉండగా, కేజ్రీవాల్.. ఆ పని చేయకుండా కోర్టును ఆశ్రయించారు. ఈసీవి తప్పుడు చర్యలు అని ఆక్షేపించారు.
కేజ్రీవాల్ తీరును గర్హిస్తూ జనవరి 21న ఈసీ ఒక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించింది. అయినాసరే కేజ్రీవాల్ దిగిరాకపోవడంతో చట్టపరమైన చర్యలకు నేడు ఆదేశాలు జారీచేసింది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా రాష్ట్రంలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీ సమీపించిన తరుణంలో ఆప అధినేతపై ఈసీ తీసుకున్న నిర్ణయం ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. (సీఎం తీరుపై ఈసీ మండిపాటు)