ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎంత విచ్చలవిడిగా తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటారో అందరికీ తెలిసిందే. అందునా అధికార పార్టీ ఎమ్మెల్యేలైతే ఇక చెప్పనే అక్కర్లేదు.
ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎంత విచ్చలవిడిగా తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటారో అందరికీ తెలిసిందే. అందునా అధికార పార్టీ ఎమ్మెల్యేలైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన నిర్వాకం. ఆయన పేరు విపిన్ శర్మ. వయసు 35 సంవత్సరాలు. దేశ రాజధాని నగరంలో ప్రజాప్రతినిధులకు కేటాయించిన మెడికల్ రీయింబర్స్మెంట్లో ఆయనగారు ఏకంగా కోటీ మూడు లక్షల రూపాయలు క్లెయిమ్ చేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద బయటపడింది.
మొత్తం 43 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్ వివరాలను ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలున్నారు. వీళ్లు 2008 నుంచి 2013 అక్టోబర్ వరకు క్లెయిమ్ చేసిన మెడికల్ బిల్లుల వివరాలను ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ కోరారు. వీళ్లలో అత్యధికంగా విపిన్ శర్మ 1.03 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయగా, ఆయన తర్వాతి స్థానంలో రూ. 25 లక్షలతో స్వతంత్ర ఎమ్మెల్యే భరత్ సింగ్ ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే హెచ్.ఎస్.బల్లి తన వైద్య ఖర్చుల కింద 17 లక్షలు క్లెయిమ్ చేశారు. అదీ అయ్యవార్ల వైభోగం!!