
టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడే..!
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంతో పడిన మచ్చను తలసాని వ్యవహారంలో టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి ద్వారా చెరుపుకోవాలని ...
అందివచ్చిన అవకాశంతో దూకుడు పెంచిన టీటీడీపీ
‘ఓటుకు కోట్లు’తో పోయిన పరువు కాపాడుకునేందుకు తంటాలు
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంతో పడిన మచ్చను తలసాని వ్యవహారంలో టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి ద్వారా చెరుపుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తమ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస్ లక్ష్యంగా దూకుడు పెంచింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య జైలుకు కూడా వెళ్లారు. ఇదే కేసులో పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటకు రావడంతో పరువు మరింత దిగజారింది. ఈ కేసుతో ఆత్మరక్షణలో పడిన పార్టీనేతలు ఇప్పుడు అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు.
కలసి వచ్చిన అవకాశం
గత ఎన్నికల్లో టీటీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా వారిలో ఐదుగురు టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ముఖ్యంగా టీడీపీ టికెట్‌పై గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరడంతో పాటు మంత్రి కూడా అయిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు, టీటీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్నారని, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కోర్టు గడప ఎక్కింది. ఈ కేసు విచారణలో ఉండగానే, ‘తలసాని రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి అందలేదు’ అనే సమాచారం వెలుగులోకి రావడం.. టీటీడీపీ నేతలకు అందివచ్చిన అవకాశంగా మారింది.
రాజీనామా చేయకుండానే, చేసినట్లు అబద్ధం ఆడి, మంత్రివర్గంలో చేరిన తలసానిని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా ఆపార్టీ నాయకులు ఎక్కడ అవకాశం చిక్కినా.. అటు తలసానిపై, ఇటు టీఆర్‌ఎస్‌పైనా విమర్శలు సంధిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదనే ఉద్దేశంతోనే దూకుడు పెంచినట్టు కన్పిస్తోంది.