అవకాశం దొరికినప్పుడల్లా డ్రాగన్ తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత మూడు వారాలుగా సిక్కిమ్ సరిహద్దులు డోకా లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
సిక్కిం: అవకాశం దొరికినప్పుడల్లా డ్రాగన్ తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత మూడు వారాలుగా సిక్కింలోని సరిహద్దు ప్రాంతం డోకా లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా సైన్యం ఓ అడుగు ముందుకువేసి భారత్ భూభాగంలో చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చైనా సైనికుల దుందుడుకు చర్యలపై భారత్ సైన్యాలు సంయమనం పాటిస్తూ నిలువరిస్తున్నాయి. అయినప్పటికీ చైనా సైన్యాలు తిరిగి తమ భూభాగంలోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ వాగ్వివాదానికి దిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు.. భారత భూభాగంలోకి చొచ్చుకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. భారత సైనికులు వారిని అడ్డుకొని.. వారించి వెనుకకు పంపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా సిక్కిం సెక్టార్‌లోని భూటాన్ భూభాగంలో చైనా సైన్యం రోడ్డు నిర్మిస్తుండటంతో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి విదితమే. సిక్కిం వైపున్న సరిహద్దుల్లో తమ భూభాగంలో భారత జవాన్లు అడుగు పెట్టి అక్కడ రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నారని చైనా ఆరోపణలు చేస్తోంది. అయితే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) సైనికులే మన భూభాగంలోకి ప్రవేశించి రెండు బంకర్లను ధ్వంసం చేశారన్నది మన సైన్యం వాదన. మరోవైపు చైనా రోడ్డు నిర్మాణాన్ని భూటాన్, భారత్ వ్యతిరేకిస్తున్నాయి.
అయితే, చైనా మాత్రం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ.. భారతీయులు చేపట్టే మానస సరోవర్ యాత్రను నిలిపివేశాయి. దీంతో సిక్కిం సెక్టార్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. సిక్కిం– భూటాన్–టిబెట్‌లు కలిసే ఈ ప్రాంతంలో... సరిగ్గా పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడి కారిడార్‌కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఇరుపక్షాల దళాలూ ప్రస్తుతం మోహరించి ఉన్నాయి.
తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న సిక్కిం సరిహద్దుల దగ్గరే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో తాజా పరిస్థితి ఈ వీడియోలో తెల్లతేటం అవుతోంది. మరోవైపు సిక్కింలో భారత్‌తో కొనసాగుతున్న ప్రతిష్టంభన విషయంలో రాజీకి ఆస్కారం లేదని, సమస్యను పరిష్కరించే బాధ్యత భారత్‌పైనే ఉందని చైనా నిన్న స్పష్టం చేసింది.