'తమిళ సంక్షోభంలో మేం తలదూర్చం'
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతూ తమిళనాట రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు.
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతూ తమిళనాట రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఓ న్యూస్పేపర్కు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పదవిని ఎవరూ చేపట్టలన్నది వారే నిర్ణయించుకుంటారని తెలిపారు.
తమిళనాడు రాజకీయ సంక్షోభంలో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదని, నిరాధారమైన ఆరోపణలను కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. తమిళ ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న పోరులో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. ఈ పీఠం అధిరోహించడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తున్నారు. శుక్రవారం ఇరునేతల అభిప్రాయాలు తెలుసుకున్న ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఓ నివేదికను కేంద్రానికి పంపారు. దీనిపై గవర్నర్ ప్రకటన చేయాల్సి ఉంది.