'ఆయన ఓ ఆధ్యాత్మిక శ్రీమంతుడు'

'ఆయన ఓ ఆధ్యాత్మిక శ్రీమంతుడు'


ముంబయి: ఆయనొక పేరు మోసిన వ్యాపార వేత్త. వారికి కోట్లలో ఆస్తి. దాదాపు 55 ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఉన్నారు. కానీ, ఉన్నపళంగా అనూహ్యంగా మిగతా భాగస్వాములంతా అవాక్కయ్యేలా తన బాధ్యతలను వదులుకున్నారు. దీంతోపాటు ఇక ఆస్పత్రుల నిర్వహణ బాధ్యతలే కాకుండా ఆ వాసనే అంటకుండా దూరంగా జరిగారు. అది కూడా 'సేవామార్గానికి'. ఇప్పటి వరకు మంచి వైద్యం అందజేయడం ద్వారా సమాజానికి సేవలు అందించిన ఈ ఖరీదైన వ్యాపార వేత్త ఇక తన ఆధ్మాత్మిక ఆలోచనలతో సేవ చేయాలనుకుని ఆధ్యాత్మిక సేవా మార్గం ఎంచుకున్నారు.

 

ఫోర్టిస్ హెల్త్ కేర్ అనే పేరుగడించిన ఆస్పత్రులకు శివిందర్ మోహన్ సింగ్ అనే బిలియనీర్ వ్యాపారవేత్త ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఆయన తన సేవలు అందిస్తున్నారు. అయితే, ఉన్నపలంగా తన బాధ్యతలను విరమించుకుని 'రాధా సోమి సత్సంగ్ బియాస్' అనే ఆధ్మాత్మిక సంస్థలో చేరి పూర్తిస్థాయిలో ఆధ్మాత్మిక చింతనలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఫోర్టిస్ కంపెనీ స్పష్టం చేసింది. 40 ఏళ్ల శివిందర్ సింగ్కు మలవిందర్ అనే సోదరుడు కూడా ఉన్నారు. వీరిరువురు ఫోర్టిస్ బ్రాండ్ కింద 55 ఆస్పత్రులు నడుపుతున్నారు. దీంతోపాటు రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ అనే ఆర్థిక సేవలు అందించే సంస్థ కూడా ఉంది.



రాధా సోమి సత్సంగ్ బియాస్ అనేది అమృతసర్కు చెందిన తత్వసంబంధ ఆధ్యాత్మిక సంస్థ. ప్రస్తుతం శివిందర్ సింగ్ ఇందులో చేరుతుండటంతో 2016 జనవరి 1 నుంచి ఫోర్టిస్ సంస్థ ఆయనను నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాతో గౌరవించనుంది. శివిందర్ సింగ్ సోదరుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగనున్నారు. ఈ ఇరువురు సోదరులు 2015 ఇండియన్ బిలియనీర్స్ ఫోర్బ్స్ జాబితాలో 35 స్థానాన్ని పొందారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top