విభజన చట్టబద్ధం కాదు: మేకపాటి

విభజన చట్టబద్ధం కాదు: మేకపాటి - Sakshi


 స్టే ఇవ్వాలని సుప్రీంలో మేకపాటి పిటిషన్

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, బలవంతంగా విభజిస్తోందని... విభజనపై స్టే ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ కేంద్రం విభజిస్తోంది. రాష్ట్ర ప్రజలకు దీనిపై న్యాయపోరాటం మినహా మరే ప్రత్యామ్నాయం లేకుండా చేసింది. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులనూ పట్టించుకోకుండా విభజన చేస్తోంది. రాజధాని చుట్టూ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు ఏర్పడ్డాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు ఈ విషయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత 50 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పెట్టుబడులన్నీ  కేంద్రీకృతమయ్యాయి. వాటిలో 90 శాతం  సీమాంధ్ర వారివే. 99 శాతం ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఇక్కడే నెలకొన్నాయి.

 

   పైగా 2012-13 సాఫ్ట్‌వేర్ పరిశ్రమ టర్నోవర్ రూ. 55,000 కోట్లు అయితే.. ఒక్క హైదరాబాద్ టర్నోవరే రూ. 54,800 కోట్లు. మరి మిగిలిన సీమాంధ్ర పరిస్థితి ఏంటి? అమ్మకపు పన్నులో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు రెవెన్యూ లోటు తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు తమ అవసరాలు నిండితే గానీ నీళ్లు వదలట్లేదు. వీటిపై అనేక న్యాయవివాదాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే కింది ప్రాంతమైన సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక ఆర్టికల్ 371(డి)ని కూడా కేంద్రం విస్మరిస్తోంది...’ అని పిటిషన్‌లో విన్నవించారు. అందువల్ల ఈ బిల్లు చట్టబద్ధంగా లేద ని ఆదేశాలివ్వాలంటూ కోరారు. అయితే ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు సరైన సమయం కాదంటూ కోర్టు గతంలో మేకపాటి దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top