బిబిసి న్యూస్ రీడర్ కోమ్లా డ్యూమర్ కన్నుమూత | BBC World TV’s Komla Dumor dies | Sakshi
Sakshi News home page

బిబిసి జర్నలిస్ట్ కోమ్లా డ్యూమర్ కన్నుమూత

Jan 20 2014 7:44 PM | Updated on Sep 2 2017 2:49 AM

కోమ్లా డ్యూమర్

కోమ్లా డ్యూమర్

బిబిసి టీవీ న్యూస్ రీడర్ కోమ్లా డ్యూమర్ భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం తన నివాసంలో హఠాన్మరణం చెందారు.

 బిబిసి టీవీ న్యూస్ రీడర్ కోమ్లా డ్యూమర్ భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం లండన్ లోని తన నివాసంలో హఠాన్మరణం చెందారు. ప్రముఖ జర్నలిస్టు అయిన కోమ్లా వయసు 41 సంవత్సరాలు. ఘనాలో జన్మించిన కోమ్లా, బిబిసి వరల్డ్‌లో ఆఫ్రికాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  2007లో బిబిసిలో రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా ప్రవేశించారు. ఘనా దేశ ప్రెసిడెంట్ జాన్ డ్రమానీ మహామా  కోమ్లా మరణానికి స్పందిస్తూ ‘‘మా దేశం ఒక మంచి రాయబారిని కోల్పోయింది’’ అన్నారు. ఆఫ్రికా చరిత్ర గురించి ఎంతో వాస్తవంగా చెబుతాడని పలువురు ప్రముఖులు ఆయనను స్మరించుకున్నారు. ఆఫ్రికా ఘనతను తన గొంతులో రెట్టింపుచేసి చెబుతాడని కూడా అన్నారు. అతని స్నేహితులు, సహచరులు  మరణవార్త విని హతాశులమయ్యామన్నారు. ఆఫ్రికన్ మ్యాగజీన్ వెలువరించిన అత్యంత ప్రభావితులైన 100 మందిలో కోమ్లా కూడా ఉన్నారు. ఆఫ్రికాకు సంబంధించిన అంశాలను ఒంటిచేత్తో నడిపిన ఘనత కోమ్లాది.
 
 1972, అక్టోబరు 3 న ఘనాలోని ఆక్రాలో జన్మించారు కోమ్లా. ఘనా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ,సైకాలజీ అంశాలలో బిఏ చేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ చేశారు. బిబిసిలో చేరిన నాలుగు సంవత్సరాలకే 2003 లో ‘ఘనా జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్నారు. అప్పటి నుంచి 2009లో ‘ద వరల్డ్ టుడే ప్రోగ్రామ్’ చేసేవరకు నెట్‌వర్క్ ఆఫ్రికాకు పనిచేశారు.2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ‘ప్రపంచ కప్పు’కి ప్రయోక్తగా వ్యవహరించారు.
 
 2009లో కోమ్లా మొట్టమొదటి హోస్ట్‌గా ‘ఆఫ్రికా బిజినెస్ రిపోర్ట్’కి పనిచేశారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు ఆఫ్రికా ఫోకస్ కార్యక్రమాన్ని ఆసక్తిదాయకంగా నిర్వహించారు. ఆఫ్రికా అంతా పర్యటించి, టాప్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని కలిసి వారితో లేటెస్ట్ బిజినెస్ ట్రెండ్స్ చర్చించేవారు. ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఘనత కోమ్లాది. బిల్ గేట్స్, కోఫ్నీ అన్నన్ వంటివారితో సైతం సంభాషించారు. కిందటి నెల మరణించిన నెల్సన్ మండేలా అంతిమయాత్రలో, ‘‘ఆధునిక చరిత్రలో ఒక గొప్ప మహానుభావుడు. మండేలా మరణం బాధాకరమే. కాని ఆయన మీద కార్యక్రమం చేయడం మాత్రం నాకు ఒక మధురానుభూతి. అందుకు ఆయనకు కృతజ్ఞతను చెప్పుకుంటాను’’ అన్నారు.
 - డాక్టర్ వైజయంతి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement