ఈసీ చేతికి ఓటుకు కోట్లు ఆడియో, వీడియో

ఈసీ చేతికి ఓటుకు కోట్లు ఆడియో, వీడియో


ప్రత్యేక కోర్టు నుంచి రికార్డులు తీసుకున్న ఈసీ

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో భాగంగా ఏసీబీ రికార్డు చేసిన ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ల నకలు కాపీలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులకు అందాయి. తమకు ఈ ఆడియో, వీడియో రికార్డులను ఇవ్వాలని కోరుతూ ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ మేరకు వారికి హార్డ్‌డిస్క్‌లు ఇచ్చేందుకు అనుమతించారు. కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు నిందితులుగా ఉండడంతోతోపాటు, పలువురు  ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను పరిశీలించాలని ఈసీ భావిస్తోంది.

 

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటు కోసం రూ.5 కోట్లు ఇస్తామంటూ రేవంత్‌రెడ్డి ప్రలోభపెట్టడం, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇవ్వడంతోపాటు ఇవన్నీ మా పార్టీ అధినేత ఆదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పడం తదితర అంశాలను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే కోర్టు నుంచి తీసుకోగా...తాజా ఆడియో, వీడియో రికార్డులను కూడా తీసుకున్నారు. అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు, సంబంధం ఉన్న ఇతర చట్టసభల ప్రతినిధులపై ఎన్నికల చట్టాల కింద ఎన్నికల సంఘం క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top