
ఒంటరి సమరానికే సిద్ధం..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ఒంటరిగా తమ సత్తాను చాటుకునేందుకు ఎవరికి వారు రెడీ అవుతున్నట్టున్నారు.
కసరత్తుల్లో పార్టీలు
రాందాసు రెడీ
టీఎన్‌సీసీలో ‘రాహుల్’ ముద్ర
చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ఒంటరిగా తమ సత్తాను చాటుకునేందుకు ఎవరికి వారు రెడీ అవుతున్నట్టున్నారు. ఇందుకు తగ్గ కసరత్తుల్ని వేగవంతం చేశారు. ఒంటరి సమరానికి పీఎంకే నేత రాందాసు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, కాంగ్రెస్‌ను అదే బాటలో పయనింప చేయడానికి రాహుల్ తన మార్క్ రాజకీయానికి సిద్ధమయ్యారు. ఇక, ఒంటరి సమరానికి అన్నాడీఎంకే వెనకాడే ప్రసక్తే లేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డిఎంకే కూడా అదే నిర్ణయం తీసుకోకతప్పదేమో.
అసెంబ్లీ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఓ వైపు ఎన్నికల యంత్రాంగం నిర్వహణ ఏర్పాట్ల మీద దృష్టి పెడితే, మరో వైపు రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉన్నాయి. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, ఎంఎంకేలు ప్రజా కూటమిగా ముందుకు సాగుతున్నా, ఇది ఎన్నికల వరకు పదిలంగా ఉండేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, తమ కూటమిలోకి డీఎండీకే నేత విజయకాంత్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌లను ఆహ్వానించేందుకు ప్రజా కూటమి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నది. అయితే, ఆ నేతలు ఎవరికీ చిక్కకుండా తమ తమ పయనాన్ని సాగిస్తున్నారు. అలాగే, డీఎండీకేను తమ వైపుకు తిప్పకునేందుకు మరో వైపు బీజేపీ సైతం ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు.
అయితే, విజయకాంత్ నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, ఎన్నికల నగారా మోగి, నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరే వరకు వేచి చూడాల్సిందే. నాన్చుడు ధోరణి ప్రదర్శించినా చివరకు తాను ఒంటరినే అని ప్రకటించుకున్నా ఆశ్చర్య పోక తప్పదు. అలాగే, జీకే వాసన్ చూపు అన్నాడీఎంకే వైపు అన్న సంకేతాలు ఉన్నా, ఆ పార్టీ తలుపులు తెరుచుకునేనా..? అన్నది వేచి చూడక తప్పదు. ఇక, పీఎంకే నేత రాందాసు అందరికన్నా ముందుగా ఒంటరికి తాను రెడీ అని చాటేసుకున్నారు. తన కుమారుడు, ఎంపీ అన్భుమణి రాందాసును సీఎం అభ్యర్థిగా ప్రకటించేసి ప్రజాకర్షణ దిశగా ఉరకలు తీస్తున్నారు. అయితే, రాందాసు మాట మీద నిలబడేనా అన్నది గత అనుభవాలను గుర్తు చేయక మానదు.
మళ్లీ అధికారం : మళ్లీ అధికార పగ్గాలు లక్ష్యంగా సీఎం జయలలిత పావులు కదుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సన్నిహితం మేరకు బీజేపీనీ అక్కన చేర్చుకుంటారా? లేదా లోక్ సభ ఎన్నికల తరహాలో ఒంటరి సమరానికి మళ్లీ సాహసం చేస్తారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఆ పార్టీలోని మెజారిటీ శాతం మంది ఒంటరి సమరమేనంటున్నారు.
భంగపాటు : ఇక, ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న డీఎంకే అధినేత ఎం కరుణానిధికి భంగపాటు తప్పడం లేదు. ఆయన వ్యూహాలన్నీ బెడిసి కొడుతూ వస్తున్నాయి. మెగా కూటమికి ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందన కరువైంది. ఒంటరిగా నైనా ఎన్నికల కదనరంగంలో దిగే విధంగా డీఎంకే వర్గాలు మానసికంగా ఇప్పటి నుంచి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మార్క్ రాజకీయానికి మరో మారు సిద్ధం కావడంతో డీఎంకే తో చేతులు కలిపేనా అన్నది చూడాల్సిందే.
రాహుల్ ముద్ర: డీఎంకేతో కలిసి పని చేయడం అన్నది ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆది నుంచి ఇష్టం లేదని చెప్పవచ్చు. కాంగ్రెస్ పెద్దలు చెన్నైకు వస్తే తప్పకుండా డీఎంకే అధినేతఎం కరుణానిధి ఇంటి మెట్లను మర్యాదకైనా ఎక్కుతారు.అయితే, రాహుల్ ఆ ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం రానున్న ఎన్నికల ద్వారా తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి యువనేత సిద్ధం అయ్యారు. ఇప్పటి్కే రాహుల్ తన వ్యూహాల్ని ఆచరణలో పెట్టమని ఉపదేశించి ఉన్నారు.
అలాగే, పోలింగ్ బూత్ ఐదుగురితో ప్రత్యేక కమిటీ, మండలాల వారీగా కమిటీల్ని ఏర్పాటు చేయడంతో పాటుగా బలోపేతం దిశగా, అవసరం అయితే, ఒంటరి సమరానికి పార్టీ వర్గాల్ని సిద్ధం చేసే విధంగా ఇక పయనం సాగించాలని సూచించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి అన్ని పార్టీలు ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటూ, ఏదో కొన్ని సీట్లు దక్కుతాయన్న ధీమాతో పావులు కదిపేందుకు సిద్ధం అవుతున్నాయి. ఎన్నికల నగారా మోగిన అనంతరం సాగే బేరసారాల మేరకు రాజకీయ పరిస్థితులు మారే అవకాశాలూ ఎక్కువే. ఇందుకు గత అనుభవాలే నిదర్శనం.