ఢిల్లీలో గవర్నర్‌తో ఏపీ సీఎం భేటీ

ఢిల్లీలో గవర్నర్‌తో ఏపీ సీఎం  భేటీ - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో గత కొద్దికాలంగా దూరదూరంగా ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయనతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉం డేందుకు వీలుగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, కేంద్ర వైఖరి, న్యాయ వివాదాలు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం.



 తలసాని రాజీనామా స్పీకర్ పరిధిలో ఉంది: గవర్నర్

 తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చిన అంశం స్పీకర్ పరిధిలో ఉందని నరసింహన్ స్పష్టం చేశారు. ఆయన రాజీనామా సమర్పించినట్టుగానే తన వద్ద సమాచారం ఉందని వివరించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షితో దాదాపు గంటన్నరపాటు సమావేశం అయిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.



‘ప్రత్యేకం కానీ, సంచలనం కానీ ఏమీ లేదు. ఈ రోజు రాష్ట్రపతిని కలిశాను. హోం మంత్రిని కలిశాను. మంగళవారం రక్షణ శాఖ మంత్రిని కలుస్తాను..’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ‘అంతా సుఖమయమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి..’ అన్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళుతున్నారా? అని ప్రశ్నించగా.. ‘వెళ్తున్నాను.. వెళ్లకూడదా? పిలిస్తే వెళతాం కదా.. ఎందుకు వెళ్లం?’ అని ఎదురు ప్రశ్నించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top