ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కఠిన పరపతి విధానాన్ని మరింతగా సరళతరం చేసే అవకాశాలున్నాయని
ప్రథమార్ధంలో తగ్గవచ్చంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కఠిన పరపతి విధానాన్ని మరింతగా సరళతరం చేసే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో పాలసీ రేట్లను మరో అరశాతం తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, బార్‌క్లేస్, సిటీగ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ తదితర అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థల అంచనాల ప్రకారం 2015లో వర్షపాతం ఎలా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం సానుకూల స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది.
కమోడిటీల ధరలు తగ్గుతుండటమే ఇందుకు కారణం. దీంతో ఆర్‌బీఐ పాలసీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని భావిస్తున్నట్లు బార్‌క్లేస్ ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు, ఆర్‌బీఐ రెపో రేటును మార్చి/ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్లు, జూన్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని అంచనా వేస్తున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణ చర్యలు మొదలైన వాటి కారణంగా రిజర్వ్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్ల దాకా రేట్లను తగ్గించవచ్చని తాము ముందుగా వేసిన అంచనాలను యథాప్రకారంగా కొనసాగిస్తున్నట్లు సిటీగ్రూప్ వివరించింది. డిమాండు పెరిగేందుకు, తద్వారా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాలు కోరుతున్న సంగతి తెలిసిందే.
ఆర్‌బీఐ ప్రస్తుత కీలక రేట్లు
రెపో రేటు: 7.75 శాతం
(బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే రేటు)
రివర్స్ రెపో: 6.75 శాతం
(బ్యాంకులు తన వద్ద ఉంచే డిపాజిట్లపై
ఆర్‌బీఐ చెల్లించే రేటు)