అన్ని బ్రాండ్లకూ అంబాసిడర్లు!

అన్ని బ్రాండ్లకూ అంబాసిడర్లు!


 వస్త్ర దుకాణాల్లో మానిక్విన్ల హవా

 30 శాతం కొనుగోళ్లు వీటి ఆధారంగానే!    వీటికి తొడిగే వస్త్రాల అమ్మకాలు వేగవంతం

  రూ. వెయ్యి కోట్ల పరిశ్రమ; ఏటా 30% వృద్ధి    ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి ఫైబర్  బొమ్మలు

 అధిక శాతం మానిక్విన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే...  

 

 ఓ షాపుకెళతాం. అక్కడ మొదట కనిపించేది మనల్నే చూస్తున్నట్లుండే ముద్దుబొమ్మలు. నిజమే! అవి బొమ్మలే. ఆరడుగుల అబ్బాయిలు... అదిరిపోయే కొలతలుండే అమ్మాయిలు. చిన్నాపెద్దా తేడా లేకుండా దేశంలో ప్రతి వస్త్ర దుకాణానికీ ఈ బొమ్మలే బ్రాండ్ అంబాసిడర్లు. ఇంకో విశేషమేంటంటే దాదాపు 30 శాతం వస్త్రాల అమ్మకాలు ఈ బొమ్మల వల్లే జరుగుతున్నాయట! మానిక్విన్స్‌గా పేర్కొనే ఈ బొమ్మల్ని లే ఫిగర్, డమ్మీ, డ్రెస్ ఫామ్... ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఈ బ్రాండ్ అంబాసిడర్ల వెనకున్న బిజినెస్ కథాకమామిషు... ఇదిగో!

 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ బట్టల షాపు చూసినా అక్కడ వినియోగదారుల కళ్లు ముందుగా పడేది మానిక్విన్లపైనే. ఎందుకంటే లేటెస్ట్ ట్రెండ్‌ను ప్రతిబింబించే దుస్తుల్ని, తమ షాపులోకి కొత్తగా వచ్చిన స్టాకును ప్రదర్శించడానికి వ్యాపారి వాటినే వాడుతుంటాడు. ఆ దుకాణం ఆఫర్ చేస్తున్న వెరైటీలేంటో కస్టమర్లకు తెలియాలంటే మానిక్విన్లను చూస్తే చాలు. అందుకే దుకాణదారులు కూడా నిపుణులైన విజువల్ మర్చండైజర్లను నియమించుకుంటున్నారు. వీరు సీజన్‌నుబట్టి, ఫ్యాషన్‌ను బట్టి ప్రస్తుతం నడుస్తున్న రంగుల దుస్తులను బొ మ్మలపై ప్రదర్శిస్తారు. దుకాణంలో బొమ్మపైనున్న దుస్తులను పోలిన వెరైటీలను కస్టమర్ల సౌలభ్యం కోసం పక్కనే ఉంచుతారు కూడా. మానిక్విన్లపై వేసిన దుస్తులు ఇతర దుస్తులతో పోలిస్తే 43% వేగంగా అమ్ముడవుతాయని పాపులర్ బ్రాండ్ ‘అలెన్ సోలీ’ చెబుతోంది.

 

 కాంబినేషన్ ఇలా...

 చాలా మందికి రంగులు, కాంబినేషన్లు తెలియవు. ఏ రంగువారికి ఏ దుస్తులు బాగుంటాయనే అవగాహన ఉండదు. ఒక కస్టమర్‌కు ఒక కలర్, స్టైల్ సరితూగుతుందా లేదా అనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో సేల్స్‌మెన్ చెప్పలేరు. అందుకే మానిక్విన్లపైనున్న వెరైటీలను చూసి కస్టమర్ ఒక అంచనాకు వస్తారు. భార్యాభర్త ఏదైనా శుభకార్యానికి వెళ్లాలంటే వారిరువురు ఎలాంటి కాంబినేషన్ వేసుకోవచ్చో కపుల్ మానిక్విన్లను చూస్తే చాలు. మానిక్విన్లు నిశ్శబ్దంగానే ఉంటాయి. కానీ 30% అమ్మకాలకు అవే ఆధారమని బిగ్‌బజార్ ఫ్యా మిలీ సెంటర్ హెడ్ సిలాస్ పాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. కస్టమర్ కొనుగోలు నిర్ణయానికి అవే కీలకమన్నారు.

 ఇప్పుడంతా వెస్టర్న్ ఫిగర్లే..: గతంలో మానిక్విన్ల సైజులో ప్రత్యేక ప్రమాణాలేవీ ఉండేవి కావు. ఇప్పుడు ట్రెండ్‌మారింది. మహిళ బొమ్మ అయితే 34-24-36 సైజులో 5 అడుగుల 10 అంగుళాలుంటుంది.

 

 పురుషుడి బొమ్మయితే 38-32-38 సైజులో 6 అడుగులు ఉంటోంది. బొమ్మ ఫీచర్స్ సాధారణ భారతీయుల్లా ఉండాలని గతంలో కోరేవారు. ఇప్పుడు వెస్టర్న్ మానిక్విన్స్ కావాలంటున్నారు. ఎటువంటి ముఖ ఫీచర్లు లేని బొమ్మలు, లేదా తల లేకుండా ఉన్నవి కూడా కొనుగోలు చేస్తున్నారు. తెలుపు, నలుపు, ఇతర రంగుల్లోనూ మానిక్విన్లు లభిస్తున్నాయి. మనిషి రూపానికి దగ్గరగా ఉండేలా చర్మం రంగులోనూ వీటిని తయారు చేస్తున్నారు. ప్రధానంగా చీరలు, చుడీదార్లు, లంగాఓణీల ప్రదర్శన కోసం వీటిని ఎక్కువగా వాడుతుంటారు. దేశంలో 70% మానిక్విన్ల అమ్మకాలు చర్మం రంగువే. ఇక రూ.1,200 లోపు ధరలో కలర్‌ఫుల్ విగ్గులు లభిస్తున్నాయి. ప్రత్యేకత కోసం దుకాణదారులు రోజుకో రకం విగ్‌ను ఎంచుకోవడమేగాక రోజూ దుస్తుల్ని కూడా మారుస్తున్నారు.

 

 కళ్లలో కెమెరాతో... త్వరలో

 చాలా కంపెనీలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన మానిక్విన్లను దేశంలో విక్రయిస్తున్నాయి. ఒకటిరెండేళ్లు దాటితే చాలు ఇవి పాడవుతాయి. వీటి ధర కూడా రూ.10 వేల వరకు ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఫైబర్ మానిక్విన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన 3ఎస్ మానిక్విన్స్ భారత్‌లో తొలిసారిగా విరగని ఫైబర్ మానిక్విన్లను పరిచయం చేసింది. అవతార్, రోబోటిక్ సిరీస్‌తోపాటు వాలెంటైన్ సిరీస్‌లో జంటగా ఉండే బొమ్మలను తీసుకొచ్చింది. ఈ బొమ్మల ధర రూ.5 వేల నుంచి మొదలై నాణ్యతను బట్టి రూ.50 వేల వరకు ఉంటుందని 3ఎస్ దక్షిణ భారత పంపిణీదారు శోభా అప్పారెల్స్ ప్రతినిధి చందేష్ బోరా చెప్పారు. కళ్లలో కెమెరా ఉండే మానిక్విన్లను త్వరలో తాము మార్కెట్లోకి తేబోతున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 200కు పైగా పెద్ద ఔట్‌లెట్లకు తాము మానిక్విన్లను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

 రూ.1,000 కోట్లపైనే...: దేశవ్యాప్తంగా మానిక్విన్ల వ్యాపారం రూ.1,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. దేశీయ కంపెనీల ఉత్పత్తుల ధరలు రూ.2,500 నుంచి రూ.10 వేలుంటే, విదేశీవి రూ.8 వేల నుంచి రూ.50 వేల దాకా ఉన్నాయని ఢిల్లీకి చెందిన కాన్సెప్ట్ మానిక్విన్స్ భాగస్వామి రాజిందర్ సింగ్ భాటియా చెప్పారు. ఏటా ఈ పరిశ్రమ 30 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, తైవాన్, చైనాల నుంచి ఎక్కువగా బొమ్మలు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ప్లాస్టిక్‌తో చేసిన చౌక ఉత్పత్తులు కూడా లభిస్తున్నాయి. రంగు, సైజు, రూపం, మెటీరియల్, ఫినిషింగ్ ఇలా చూసుకుంటే 1,000కి పైగా రకాలు దుకాణాల్లో హొయలు ఒలకబోస్తున్నాయి. ఆభరణాల దుకాణాల్లోనూ ఇవి తళుక్కుమంటున్నాయి. మొత్తం అమ్మకాల్లో 60 నుంచి 65 శాతం వాటా మహిళా మానిక్విన్లదే కావటం గమనార్హం.

 

 కొసమెరుపు: వస్త్ర ప్రపంచంలో ఒకపక్క షోరూమ్ బొమ్మల (మానిక్విన్ల) వినియోగం అంతకంతకూ పెరుగుతూ ఉంటే... ముంబైలో మాత్రం ఇటీవలే వీటికి షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. లింగరీ(మహిళల లోదుస్తులు)ని ప్రదర్శించే మానిక్విన్ల కారణంగా మహిళలపై లైంగిక దురాగతాలు పెరిగిపోతున్నాంటూ సామాజిక సంస్థలు గొంతెత్తడంతో వీటి వినియోగానికి అడ్డుకట్టపడింది. షోరూమ్‌లలో లింగరీ మానిక్విన్ల ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top