
ముంబై: గణపతి నవరాత్రులు మహారాష్ట్రంలోని ముంబైని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాడవాడలా ఏర్పాటైన గణేశ్ మండపాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. దీనికితోడు అక్కడ హోరెత్తిస్తున్న భక్తి పాటలు, డప్పుశబ్ధాలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. అయితే ఈ ఉత్సవాలు వ్యాపారవర్గాలకూ భలే కలిసి వస్తున్నాయి. వివిధ సంస్థలు పనిలో పనిగా వివిధ గణేశ్ మండపాల్లో తమ బ్రండ్‌లకు ప్రమోషన్ చేసుకుంటున్నారు.
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాల నుండి రియల్ ఎస్టేట్ సంస్థల వరకు అన్ని కంపెనీలు ఉత్సవాల్లో తమ బ్రాండ్‌లకు ప్రచారం కల్పించుకుంటున్నారు. కిరాణా సామగ్రిని విక్రయించే కొన్ని క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పది నిమిషాల్లో డెలివరీ పేరుతో వినాయక పూజకు సంబంధించిన సామగ్రితో పాటు మోదకాలను కూడా విరివిగా విక్రయిస్తున్నాయి. తమ కంపెనీల స్థాళ్లను వినాయక మండపాల వద్ద పెట్టి, వినియోగదారులను వివిధ ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి.
ప్రముఖ బిస్కెట్లు, స్వీట్ల కంపెనీ గణేశ్ మండపాల వద్ద తమ బ్రాండ్ స్టాల్స్ పెట్టి, అక్కడికి వచ్చే భక్తులకు శాంపిల్స్‌ను అందిస్తున్నాయి. అలాగే తమ వంటకాల రుచులను కూడా చూపిస్తున్నాయి. మోదక్ చాక్లెట్ల పేరుతో వినియోగదారులకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ‘ఆర్గానిక్ తత్త్వ’ అనే కంపెనీ వినాయక ఉత్సవాలనే టార్గెట్‌గా చేసుకుని తమ ఉత్పత్తులకు విరివిగా ప్రచారం కల్పిస్తోంది. ఆర్గానిక్ బెల్లం, పప్పు దినుసులను విక్రయిస్తోంది.
ఒక ప్రముఖ పెయింటింగ్ కంపెనీ రాబోయే దీపావళికి మీ ఇంటికి మా రంగులు వేయించుకోండి అంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఆఫర్లు కూడా ప్రకటించింది. దీనిని ప్రతిబింబించేలా ఒక ప్రకటన కూడా రూపొందించి గణేశ్ మండపాల వద్ద ప్రదర్శిస్తోంది. ఒక వంట నూనెల సంస్థ.. తమ ఆయిల్‌తో వంటకాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయని చెబుతూ, మండపాలకు వచ్చే భక్తులకు వివిధ శాంపిల్ రుచులను చూపిస్తోంది. ఈ విధమైన బ్రాండ్‌ల ప్రచారాన్ని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మనకెందుకులే అనుకుంటూ, మండపాల వద్ద బ్రాండ్ శాంపిల్స్ తీసుకుంటూ మురిసిపోతున్నారు.