
పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్‌ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్ బచ్చన్ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్‌కుమార్, మంజు వారియర్... ఇలా నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .
నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌ని ఎంపిక చేసిందని కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెటింగ్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్‌లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్ బాలీవుడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోనమ్ కపూర్ వంటి వారితో కూడా జట్టు కట్టింది.
బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీయార్ మలబార్ గోల్డ్‌లో మెరిశారు. ఇక రామ్ చరణ్ భీమా జ్యుయలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్ పిఎంజె జ్యుయల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్‌గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్ డమ్ మెరుపులను జత చేశారు.
ఒక్కసారి పరిశీలిస్తే...
నటి తమన్నా భాటియా వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్‌ను స్వయంగా లాంచ్ చేసింది. అంతేకాదు ఆమె హెడ్ డిజైనర్‌గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్‌కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్’ను ఆవిష్కరించారు. త్రిభువన్ దాస్ భీమ్‌జీ జువేరీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్‌కు మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్, బాలీవుడ్ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్ పులావ్, గులాబీ లెన్స్ వంటి సినిమాల్లో పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన అనుష్కా రంజన్ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెరిసింది. ఖన్నా జ్యువెలర్స్ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్ పనిచేసింది.
కలెక్షన్స్ విడుదల్లోనూ...
బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్‌ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను రిలయన్స్ జ్యువెల్స్ ’తంజావూర్ కలెక్షన్’ను లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్ సైతం అంతకు ముందే ఈ తంజావూర్ కలెక్షన్‌ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్ జ్యువెలర్స్ అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్‌ను ప్రారంభించింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్లస్ గోల్డ్ కు సోనాక్షి సిన్హా ప్లస్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్ ఫైనాన్స్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జట్టు కట్టారు.
ప్రతి పండుగ సీజన్‌లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్ మీడియా సిటీ హోర్డింగ్‌లలో గోల్డ్ ఫీవర్ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలకు చెందిన తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక సెలబ్రిటీ పని బ్రాండ్ తాజా కలెక్షన్స్‌ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్ ట్రెండ్‌లు సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని వీరు తప్పనిసరిగా సోషల్ మీడియాలో బ్రాండ్ గురించి మాట్లాడాలి బ్రాండ్ ఆభరణాలను ధరించి ఈవెంట్స్‌లో కనిపించాలి. ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్‌లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు.