‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల సరసన నిలిచింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరైంది. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ..తన బ్రేకప్ స్టోరీని వివరిస్తూ.. కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి సూపర్ 30 సినిమా షూటింగ్‌లో పాల్గొనే సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ అభద్రతా భావానికి గురయ్యాడని మృణాల్ వెల్లడించింది. అగ్రహీరోలతో నటించే అవకాశం రావడంతో.. ఎక్కడ తనని వదిలేస్తానేమో అనే భయంతో జిమ్‌కి వెళ్లి కండలు కూడా పెంచాడని, కానీ ఎంతో నిజాయితీగా ఉన్న ఆ బంధం నిలవలేదని మృణాల్ తెలిపింది.

‘కెరీర్ ప్రారంభంలో నేను షూటింగ్‌కి వెళ్లిన ప్రతిసారి నా బాయ్‌ఫ్రెండ్ ఆందోళనకు గురయ్యేవాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన ప్రతిసారి తనను ఎక్కడ విడిచిపెడతానోనని.. తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించేవాడు. జిమ్‌కి వెళ్లి కండలు పెంచేవాడు. ఆ సమయంలో దాదాపు 15 కిలోలు తగ్గాడు. కానీ కొన్ని రోజులకు మళ్లీ బరువు అయ్యాడు.
అతని వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగితే.. ‘నీ చుట్టూ ఉండే హీరోలతో నేను కూడా పోటీ పడాలనుకున్నా. వాళ్లలాగా నేను కూడా అందంగా మారాలనుకున్నా. కానీ నావల్ల కాలేదు. అందుకే జిమ్ మనేశా’ అని చెప్పాడు. అందం, ఫిట్‌నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం ఎంతటి మానసిక ఒత్తిడికి దారి తీస్తుందో ఆయనను చూస్తే అర్థమైంది. నేను ఎప్పుడూ అతడిని బరువు తగ్గమని లేదా మారమని అడగలేదు. కానీ తన చుట్టూ ఉన్న సినీ ప్రపంచమే అతడిలో అభద్రతా భావం పెంచింది. నేను ఎంతో నిజాయితీగా ఉన్నా.. ఆ బంధం నిలవలేకపోయింది’ అని మృణాల్ చెప్పుకొచ్చింది. కాగా, తాను సినిమాల్లో నటించడం ఇష్టంలేకనే బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ చెప్పింది.


