అమ్మాయిల బ్రాండ్‌ వాల్యూ.. అమాంతం పెరిగింది! | Brands lined up for women cricketers | Sakshi
Sakshi News home page

అమ్మాయిల బ్రాండ్‌ వాల్యూ.. అమాంతం పెరిగింది!

Nov 5 2025 4:10 AM | Updated on Nov 5 2025 4:10 AM

Brands lined up for women cricketers

మహిళా క్రికెటర్ల కోసం వరుస కట్టిన బ్రాండ్స్‌.. 

వరల్డ్‌ కప్‌ దక్కించుకోవడంతో పెరిగిన క్రేజ్‌.. 

పాతఒప్పందాలను కొనసాగించేందుకూ రెడీ

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  :  మహిళా క్రికెట్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు దేశవ్యాప్తంగా అభిమా నులు పెరిగారు. సోషల్‌ మీడియా ఫాలోవర్లు రెండు మూడు రెట్లు పెరిగారు. దీంతో, ఈ విజేతలను ప్రచారకర్తలుగా నియమించుకోవడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. 

కొత్తవే కాదు.. పాత అగ్రిమెంట్లను కొనసాగించేందుకూ చర్చలు మొదలయ్యా యి. ఇప్పటికే పలు కంపెనీల బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న క్రికెటర్ల ఎండార్స్‌మెంట్‌ ఫీజులు 100% వరకు పెరిగాయి. మైదానంలోనే కాదు తమ వ్యాపార విజయంలోనూ ఈ క్రికెటర్లు బెస్ట్‌ స్కోర్‌కు దోహదం చేస్తారని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. 

మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ సెమీ–ఫైనల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్‌ బ్రాండ్‌ విలువ 100% పెరిగిందని సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ పూర్తయిన వెంటనే ఆమెతో ఒప్పందం చేసుకోవడానికి బ్రాండ్స్‌ సిద్ధమయ్యా యి. ఆమె ప్రస్తుతం రెడ్‌ బుల్, బోట్, నైకీ, ఎస్‌జీ, సర్ఫ్‌ ఎక్సెల్‌ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా ఉంది. కంపెనీ, ఒప్పంద కాలాన్ని బట్టి ఆమె ఫీజు రూ.75 లక్షల నుండి రూ.1.5 కోట్ల వరకు ఉంది.

కొత్త ఒప్పందాల కోసం..
అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన.. రెక్సోనా డియోడరెంట్, నైకీ, హ్యుండై, హెర్బాలైఫ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), గల్ఫ్‌ ఆయిల్, పీఎన్ బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా ఉంది. ఒక్కో బ్రాండ్‌ నుంచి ఆమె సుమారు 2 కోట్లు అందుకుంటోంది. 

హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఒక యాడ్‌కు రూ.1.2 కోట్లు, షెఫాలీ వర్మ రూ.25–50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మహిళా క్రికెటర్లను బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకున్న గూగుల్‌ జెమినై, రెక్సోనా, నైక్, ఎస్‌బీఐ, రెడ్‌ బుల్, ప్యూమా వంటి బ్రాండ్స్‌.. ఒప్పందాలను కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

ఇది అబ్బాయిల సత్తా
విరాట్‌ కోహ్లీ ఒక్కో బ్రాండ్‌ నుంచి రూ.4.5–10 కోట్లు
ఇతర పురుష  క్రికెటర్లు సగటున రూ.1.5–5 కోట్లు

ఇది అమ్మాయిల పవర్‌
ప్రచారకర్తగా ఒక్కో బ్రాండ్‌ నుంచి మహిళా క్రికెటర్లు అందుకునే ఫీజు..
ప్రపంచ కప్‌నకు ముందు: రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు
వరల్డ్‌ కప్‌ తర్వాత: రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు

కోకాకోలాకు చెందిన థమ్స్‌ అప్‌ ఎక్స్‌ఫోర్స్, బాడీ ఆర్మర్‌; ప్యూమా, ఏషియన్  పెయింట్స్, అడీడాస్, స్విగ్గీ 
ఇన్ స్టామార్ట్‌ బ్రాండ్స్‌ ఇప్పటికే ఉన్న ఒప్పందాలను కొనసాగించే ఆలోచనలో ఉన్నాయని సమాచారం 

కాంట్రాక్ట్‌ ఫీజు పెరుగుతుందా?
మ్యాచ్‌ ఫీజులను పురుష క్రికెటర్లకు సమానంగా 2022 నుంచి మహిళా క్రికెటర్లకూ బీసీసీఐ చెల్లిస్తోంది. అయితే వార్షిక కాంట్రాక్ట్‌ విషయంలో మాత్రం ఇరువురి మధ్య తీవ్ర అంతరం ఉంది. పురుష క్రికెటర్లు రూ.కోట్లలో అందుకుంటుంటే అమ్మాయిలు రూ.లక్షల్లో పొందుతున్నారు. 

‘ఎ ప్లస్‌’ విభాగంలో బీసీసీఐ ఒక్కో (పురుష) క్రికెటర్‌కు  వార్షిక కాంట్రాక్ట్‌ ఫీజు కింద రూ.7 కోట్లు చెల్లిస్తోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా ఈ కేటగిరీలో ఉన్నారు. మహిళా క్రికెటర్లు ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. ‘ఎ’ విభాగంలో మహిళా క్రికెటర్లలో ప్రస్తుతానికి హర్మన్ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మకు చోటు దక్కింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement