
ఎగుమతిదారులను కలవరపెట్టి, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తూ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. అది అమెరికన్ ఉత్పత్తులను వదిలివేయాలంటూ డిమాండ్ చేసే దాకా వెళ్లింది. మెక్‌డొనాల్డ్స్ కోకా–కోలా అమెజాన్, ఆపిల్.. ఇలా అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు భారతదేశంలో బహిష్కరణ డిమాండ్స్ ఎదుర్కుంటున్నాయి.
మన భారతం.. మహా మార్కెట్..
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, సంపన్న వినియోగదారుల పెరుగుతున్న స్థావరంగా కూడా మారుతోంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా విస్తరించిన అమెరికన్ బ్రాండ్‌లకు మన దేశం కీలకమైన మార్కెట్‌గా అవతరించింది. భారతీయ సంపన్నులు, అధికాదాయ వర్గాలు జీవితంలో ఉన్నతికి చిహ్నాలుగా భావిస్తూ అమెరికన్ అంతర్జాతీయ లేబుల్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, భారతదేశం మెటా, వాట్సాప్‌కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్ అలాగే ఏ ఇతర బ్రాండ్ కంటే డొమినోస్‌వే దేశంలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. పెప్సి కోకా–కోలా వంటి పానీయాలు మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇక కొత్త ఆపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్‌బక్స్ కేఫ్ లో డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు మన వాళ్లంతా పొలోమంటూ క్యూలో నిలబడడం కనిపిస్తుంది
పోటీ ఇస్తున్నాం.. విస్తరించలేకున్నాం...
నిజం చెప్పాలంటే, భారతీయ రిటైల్ కంపెనీలు స్టార్‌బక్స్ వంటి విదేశీ బ్రాండ్‌లకు దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఒక సవాలుగా ఉంది. అయితే, భారతీయ ఐటి సేవల సంస్థలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరపడ్డాయి, టిసిఎస్ , ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్‌లకు సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందిస్తున్నాయి. తరచు మన ప్రధాని స్వావలంబన కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తాయి, కానీ ‘ఇప్పుడు మనం భారతదేశ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.
నిరసనల వెల్లువ..
అమ్మకాలు దెబ్బతింటున్నాయనే తక్షణ సూచనలు లేనప్పటికీ, అమెరికా పన్నులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెరుగుతున్న డిమాండ్స్‌కు స్వదేశీ సంస్థల గొంతులు కూడా జత కలుస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి లింక్డ్‌ఇన్ లో పోస్ట్ చేసిన తన వీడియో సందేశంలో ఈ విషయంపై స్పందించారు. ‘మేడ్ ఇన్ ఇండియా‘ని ‘గ్లోబల్ అబ్సెషన్‘గా మార్చడానికి వీలుగా మన రైతులకు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా ఆహార, సౌందర్య ఉత్పత్తుల విజయాల నుంచి మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ‘మనం వేల మైళ్ల దూరంలో నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాం.
తమ స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఓ వైపు మన తయారీదారులు పోరాడుతుంటే, మరోవైపు మనవి కాని బ్రాండ్‌లపై మనం గర్వంగా ఖర్చు చేస్తున్నాం‘ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చైనా మాదిరిగానే భారతదేశానికి కూడా స్వదేశంలో వృద్ధి చెందిన ఎక్స్(గతంలో ట్విట్టర్)/ గూగుల్/ యూట్యూబ్/ వాట్సాప్/ ఎఫ్‌బీ ఉండాలి’ అని కారు డ్రైవర్‌ను కాల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసే భారతదేశ సంస్థ ‘డ్రైవ్‌యూ’ సీఈఓ రహ్మ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేసే స్వదేశీ జాగరణ్ మంచ్ గ్రూప్ భారతదేశం అంతటా బహిరంగ ర్యాలీలు నిర్వహించి, అమెరికన్ బ్రాండ్‌లను బహిష్కరించాలని ప్రజలను కోరుతోంది. ‘ప్రజలు ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు. అయితే ఇది విజయవంతం కావడానికి మరి కొంత సమయం పడుతుంది‘ అని గ్రూప్ సహ–కన్వీనర్ అశ్వని మహాజన్ అంటున్నారు. ‘ఇది జాతీయవాదం, దేశభక్తికి పిలుపు‘ అని అన్నారాయన. విదేశీ ఉత్పత్తుల స్థానంలో వాటి కంటే మంచివి, ప్రజలు ఎంచుకోగల భారతీయ బ్రాండ్‌ల స్నానపు సబ్బులు, టూత్‌పేస్ట్ శీతల పానీయాల జాబితాను ఈ సంస్థ సోషల్ మీడియాలో, షేర్ చేస్తోంది. జాబితా చేశారు. అలాగే ‘విదేశీ ఆహార సంస్థలను బహిష్కరించండి‘ అంటూ మెక్‌డొనాల్డ్స్ అనేక ఇతర రెస్టారెంట్ బ్రాండ్‌ల లోగోలతో ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలు
ఓ వైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నా అమెరికన్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన రెండవ షోరూమ్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, ఈ ప్రారంభోత్సవానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు
- సత్య బాబు