న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ అత్యంత ఉత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో మేయర్‌గా తాను భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యకలాపాలను ఒక వీడియో ద్వారా వివరించారు. తాను ఇప్పటివరకూ ప్రచారంపై పెట్టిన దృష్టిని ఇకపై పాలనవైపు మళ్లిస్తానని పేర్కొన్నారు.
సమర్థవంతమైన పాలనను అందించేందుకు, అందుకు అనుగుణమైన బృందాన్ని ఏర్పాటు చేయనున్నానని, శ్రేష్ఠత, సమగ్రత, నూతన మార్గాలతో సమస్యలను పరిష్కారం దశగా అడుగులు వేయనున్నానని తెలిపారు. న్యూయార్క్ అసెంబ్లీలో క్వీన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమ్దానీ అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా గుర్తింపు పొందారు. తన విజయం దరిమిలా మమ్దానీ ‘ఎక్స్’ ఖాతాలో ‘2025, జనవరి ఒకటిన నేను మేయర్‌గా మీ ముందు ఉంటాను. నూతన సంవత్పర వేళ ఈ నగరానికి కొత్త యుగం రాబోతోంది. మంచి ట్రాక్ రికార్డులు కలిగిన ప్రభుత్వశాఖల అనుభవజ్ఞులు, విధాన నిపుణులు, నైపుణ్యం కలిగిన శ్రామికులు నగరాన్ని మెరుగుపరచడానికి ముందు వరుసలో ఉంటారంటూ’ తన ప్రభుత్వ పాలనా తీరును మమ్దానీ వివరించారు.
Thank you, New York City. Together we made history.
Now let’s get to work. https://t.co/G7F2sbda74 pic.twitter.com/GQABMqJHgn— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 5, 2025
తన పాలనతో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని మమ్దానీ ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా మమ్దానీ విజయం దేశంలోని డెమొక్రాట్లకు ఆనందాన్ని అందించింది. మరోవైపు పార్టీలో ధైర్యాన్ని పెంచింది, 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌కు హెచ్చరికగా మారింది. తన ప్రచారంలో మమ్దానీ శ్రామిక వర్గానికి పలు హామీలిచ్చారు. చిన్నారులకు ఉచిత వైద్యం, ఉచిత బస్సు రవాణా, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాల ఏర్పాటు తదితర హామీలను ఆయన ప్రజలకు ఇచ్చారు. మమ్దానీ తన సోషలిస్ట్ ఆదర్శాలు, ముస్లిం గుర్తింపు కారణంగా అధ్యక్షుడు ట్రంప్ నుండి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మమ్దానీ.. న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించి వాటిని తిప్పికొట్టారు.
ఇది కూడా చదవండి: పాక్ మద్దతు.. భారత్‌లో మరో ఉగ్రదాడి?


