శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ మద్దతుతో పలు ఉగ్రవాద సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు అధికారవర్గాలకు సమాచారం అందిందని ‘ఎన్‌డీటీవీ’ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన దరిమిలా పాక్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మొహమ్మద్ (జేఈఎం)లు కొత్తగా సమన్వయ దాడులకు యత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం గత సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు భారత్‌లోకి చొరబాట్లు, నిఘా, సరిహద్దు లాజిస్టిక్స్‌ను ముమ్మరం చేశాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ),ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)సభ్యుల సహాయంతో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి చొరబాటు మార్గాల ద్వారా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని ఎల్‌ఈటీ యూనిట్ డ్రోన్‌లను ఉపయోగించి వైమానిక నిఘా నిర్వహించిందని, ఎల్‌ఓసీలోకి చొరబడే మార్గాలను గుర్తించిందని, రాబోయే రోజుల్లో ఫిదాయీన్ తరహా దాడులు లేదా ఆయుధ దాడులకు ఇది సూచన అని నిఘా అధికారులు వివరించారు.
మాజీ ఎస్‌ఎస్‌జీ సైనికులు, ఉగ్రవాదులతో కూడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌లు (బీఎటీలు) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) అంతటా మోహరించారని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. గత అక్టోబర్‌లో జమాత్ ఈ ఇస్లామి, హిజ్బుల్ ముజాహిదీన్ ఐఎస్‌ఐ సభ్యులు ఒకచోట సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన నష్టాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సమావేశంలో ప్రణాళికలను ఖరారు చేశారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. భారత రక్షణదళ అధికారులు అధికారులు ఈ నిఘా సమాచారాన్ని క్లిష్టమైన హెచ్చరికగా అభివర్ణించారు. ఈ నేపధ్యంలో భారత సైన్యం, నిఘా యంత్రాంగం హై అలర్ట్‌లో ఉంది. గుజరాత్, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లో భారత్ తన త్రిశూల్ ట్రై-సర్వీస్ విన్యాసాలను నిర్వహిస్తున్న సమయంలో ఈ నిఘా సమాచారం అందింది.
ఇది కూడా చదవండి: బాలిక అబద్ధం.. ‘పోక్సో’కు అమాయకుడు బలి


