అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జిన్‌పింగ్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం.. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0-5 శాతంగా ఉండేవి. అయితే 2021లో అది 20 శాతానికి చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్ వార్ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57 శాతానికి చేరింది. అయితే ఆ పెంపు 155 శాతం దాకా ఉంటుందని.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ఆయన హెచ్చరించారు కూడా. ఈలోపు..
పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా గురువారం ఈ ఇరు దేశాధినేతలు రెండు గంటలపాటు సమావేశం కాగా, చర్చలు ఫలవంతం అయ్యాయి. తాజా తగ్గింపుతో సుంకాలు 47 శాతానికి చేరాయి.
ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభం అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్ తగ్గింపుతో పాటు సోయాబీన్ కొనుగోళ్ల పునరుద్ధరణ, అలాగే.. రేర్ ఎర్త్ ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్పలేనన్న ఆయన.. ముఖ్యమైన అంశాలకు సంబంధించి వివరాలను కాసేపట్లో విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు.


