
తాజ్ మహల్ నాకెంతో ఇష్టం: జుకర్ బర్గ్
ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ ను సందర్శించడానికి తానెప్పుడూ ఇష్టపడుతుంటానని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు.
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ ను సందర్శించడానికి తానెప్పుడూ ఇష్టపడుతుంటానని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు. భారత్ పర్యటన వచ్చిన ఆయన మంగళవారం తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ దగ్గర దిగిన ఫోటోను తన ఫేస్ బుక్ పేజీలో జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు.
'బుధవారం జరగనున్న టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చాను. ఈరోజు తాజ్ మహల్ ను చూడాలని వచ్చా. ఈ అందమైన కట్టడాన్ని సందర్శించడం నాకెంతో ఇష్టం' అని ఫేస్ బుక్ లో పెట్టారు. తాను ఊహించిన దానికన్నా తాజ్ మహల్ ఎంతో అందంగా ఉందని, ఇది అపురూప కట్టడం అని ప్రశంసించారు. ప్రేమ కోసం ఏమైనా చేయగలమని తాజ్ మహల్ నిరూపిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలో రేపు టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జుకర్ బర్గ్ పాల్గొంటారు.