జానపదమే నృత్యపథం..

Dance Master Srinivas Reddy Special Story - Sakshi

కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న సత్తుపల్లివాసి  

8 సినిమాలకు నృత్యురీతులందించిన శ్రీనివాసరెడ్డి  

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన బొమ్మారెడ్డి

అమ్మలారా.. అయ్యలారా.. ఊరోన్ని నేను.. పల్లెటూరోన్ని నేను.. అంటూ ప్రారంభమైన ప్రస్థానం సినీపరిశ్రమ వరకు సాగింది. జానపద నృత్యంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచూపాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. సత్తుపల్లికి చెందిన ఓ అరటిపండ్ల వ్యాపారి నృత్య ప్రదర్శనలో ఎంతో ఖ్యాతిని ఆర్జించాడు.   

సత్తుపల్లిటౌన్‌: పట్టణంలో పేదకుటుంబానికి చెందిన బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి జీవనాధారం కోసం అరటిపండ్లు అమ్ముకుంటూ జానపదంపై పట్టు సాధించారు. బాల్యం నుంచే అనేక నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. అంతర్జాతీయ నర్తకి, సినీనటి మంజుభార్గవి సరసన నృత్య ప్రదర్శన చేశాడు. దాదాపు 28 ఏళ్లుగా జానపదంపై పట్టు సాధించిన ఈయన అనేక పాఠశాలల విద్యార్థులతో పాటు సరిహద్దున ఉన్న కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం ప్రాంతాలలోని చిన్నారులకు కూడా నృత్యంలో శిక్షణ ఇస్తూ.. జానపద కళకు ప్రాణం పోస్తున్నారు. ఈయన చేస్తున్న కృష్టికి  ఇటీవల డాక్టరేట్‌ కూడా సాధించారు.

దేశ,విదేశాలలో ప్రదర్శనలు
దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, చైనా, కాట్మాండ్‌ దేశాలలో కూడా బొమ్మారెడ్డి అనేక నృత్యం ప్రదర్శించారు. అమ్మలారా.. అయ్యలారా అనే ఒకే జానపద నృత్యాన్ని 1800 సార్లు ప్రదర్శించి ఇటీవల తెలుగుబుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. బెంగుళూరు క్రిష్టయన్‌ యూనివర్సిటీ నుంచి జానపద నృత్యంలో డాక్టరేట్‌ కూడా సాధించారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, జీనియర్స్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించారు. ఇలా ఇప్పటి వరకు 27 జాతీయ అవార్డులు, ఒక అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు.  మాజీ గవర్నర్‌ ఎన్‌డీ తివారీ, సినీహీరో చిరంజీవి, సినినటీ జయసుధ వంటి ప్రముఖుల నుంచి కూడా అభినందనలు పొందారు.

తండ్రి పేరిట ఉచిత శిక్షణలు
దేశ, విదేశాలలో ప్రదర్శనలు, ప్రశంసలు పొందుతూనే.. మరో వైపు తన తండ్రి పేరున స్థాపించిన బీఎన్‌ రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా వివిధ జిల్లాల్లో ప్రతినెలా 400 మంది పేద విద్యార్థులకు వివిధ సంస్థల ద్వారా ఉచిత శిక్షణలు ఇస్తున్నారు. 

సినీ కొరియో గ్రాఫర్‌గా..
సినీరంగంపై బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న ఆసక్తి కొరియో గ్రాఫర్‌గా అవకాశం లభించింది. జాతీయ సినీ నృత్య దర్శకులు డాక్టర్‌ శివశంకర్‌ మాస్టర్‌ వద్ద శిక్షణ పొందారు.  రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన చందమల్ల అభిలాష్‌ డైరెక్టర్‌గా ఉన్న డేంజర్‌జోన్‌ అనే హరర్‌ తెలుగు చిత్రంలో సింగిల్‌కార్డు నృత్యదర్శకునిగా పని చేశారు. కందాల వంశీ దర్శకత్వంలో ‘ఏదో కలవరం’ చిత్రంలో కొరియో గ్రాఫర్‌గా.. మిరియాల రవికుమార్‌ దర్శకత్వంలో సుమన్‌ హీరోగా నటించిన త్యాగాల వీణ చిత్రం, రామచంద్రారెడ్డి దర్శకత్వంలోని ప్రేమశక్తి చిత్రానికి, మువ్వా దర్శకత్వంలో జగపతిబాబు, చార్మి నటీనటులుగా ఉన్న ‘శబ్దం’ చిత్రానికి కొరియో గ్రాఫర్‌గా పని చేశారు. క్లీన్‌ ఇండియా, శ్రీనుగాడి ప్రేమ, ప్రేమనీదే చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేశారు. ఇలా 8 చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేయగా 4 చిత్రాలు విడుదలయ్యాయి. ఇటీవల లేపాక్షి ఉత్సవాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లేపాక్షి అవార్డును అందుకున్నారు.

కళాకారులనుతయారు చేయాలని..
నా లాగే జానపద కళలో ఎంతోమంది నిరుపేద కళాకారులు ఉన్నారు. వారిని కూడా ఈ కళలో తీర్చిదిద్దాలనుకుంటున్నా.. 28 ఏళ్లుగా జానపదకళకు సేవ చేస్తున్నాను. ప్రతీ జిల్లాలో నృత్య పాఠశాలను ఏర్పాటు చేసి అంతరించి పోతున్న జానపద కళను పైకి తేవాలనేది నా ఆశయం.   –బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, నృత్య కళాకారుడు, సత్తుపల్లి

Read latest Tollywood News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top