స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డితో శ్రీనివాసరెడ్డి (ఫైల్)
కోరిక తీరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని బెదిరింపు
వీడియో కాల్ చేస్తూ అసభ్య ప్రవర్తన వెలుగులోకి టీడీపీ
శ్రీశైలం మండలాధ్యక్షుడి రాక్షస ప్రవర్తన
సాక్షి, టాస్క్ ఫోర్స్: తమ చేష్టలతో శ్రీశైలం క్షేత్ర ప్రతిష్టతను టీడీపీ నేతలు దిగజారుస్తున్నారు. ఉద్యోగం కోసం ఓ మహిళ శ్రీశైలం టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వద్దకు రాగా, ఆమెతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరికను తీర్చితే ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను వేధించాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ నేతలు తమకు తెలియకుండా ఏ పని జరగకూడదని అధికారులకు హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల అరాచకాలకు భయపడిన అధికారులు వారు చెప్పినవారికే కాంట్రాక్టులు, ఉద్యోగాలు ఇస్తున్నారు.
ఇటీవల శ్రీశైలానికి చెందిన మహిళ తన కుటుంబ పోషణ నిమిత్తం తనకు దేవస్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించింది. ఆ మహిళపై కన్నేసిన శ్రీనివాసరెడ్డి..తాను ఏది చెబితే అదే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వద్ద ఫైనల్ అవుతుందని, తన కోరిక తీరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను వేధించాడు. అంతేకాకుండా ఆ మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీనివాసరెడ్డి తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.


