నాలుగు కేంద్రాల్లో మే 3న ‘నీట్’
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో మొత్తం నాలుగు కేంద్రాలలో 1,320 మంది విద్యార్థులు మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ) పరీక్షకు హాజరుకానున్నారని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతి నుంచి నీట్ యూజీ పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ హై స్కూల్, టెక్కే జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నీట్ యూజీ పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ దుకాణాలు మూసివేయాలన్నార. అవసరమైతే ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలను కూడా కేంద్రాలుగా వినియోగించుకోవాలన్నారు. కేటాయించిన సామర్థ్యానికి 10 శాతం అదనంగా సీట్లు ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


