
రాజన్న సాక్షిగా జానపదగీతాల షూటింగ్స్
యూట్యూబ్‌లో రికార్డుల మోత
ఇక్కడ చిత్రీకరిస్తే విజయం ఖాయమనే విశ్వాసం
ఆధ్యాత్మిక పట్టణంలో జానపద పాటల చిత్రీకరణ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలో జానపదాల చిత్రీకరణకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇక్కడి ఆడిపాడితే విజయం ఖాయమనే విశ్వాసం నిండుతోంది. అదే నమ్మకం.. అదే విశ్వాసంతో వేములవాడలో రోజురోజుకు జానపద గీతాల చిత్రీకరణ పెరిగిపోతోంది. రాజన్న సాక్షిగా షూటింగ్ చేసుకున్న ఎన్నో జానపద గీతాలు యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతున్నాయి. మిలియన్లలో వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. శివుడి సాక్షిగా ఇప్పటికే దాదాపు వెయ్యి పాటల వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. వేములవాడలో ఓ వైపు ఆధ్యాత్మికత.. మరో వైపు జానపదాల నృత్యాలతో భక్తులకు సైతం నేత్రానందం కలిగిస్తున్నాయి.
శివుడి సాక్షిగా షూటింగ్స్..
రాజన్న ఆలయ మెట్లపై ఎన్నో పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. మన సంస్కృతిని.. భక్తిని నింపుకుంటున్న ఎన్నో పాటలను ఇక్కడి షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులకు ఇలా కళాకారుల ప్రదర్శన చూస్తూ ఆనందం పొందుతున్నారు.
ప్రత్యేక ఆకర్షణ
రాజన్న ఆలయం వద్ద ఫోక్‌సాంగ్స్ షూటింగ్స్ జరుపుతుండగా.. భక్తులు గుంపులుగా ఉంటూ నేత్రానందం పొందుతున్నారు. వేములవాడ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా కళల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుంది. వేములవాడలోని ఏదో ఒక వాడలో ప్రతీ రోజు షూటింగ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ పాటలో చిన్న పార్ట్ అయినా షూటింగ్ చేస్తే విజయం ఖాయమనే నమ్మకంతో చాలా మంది కళాకారులు వేములవాడ బాట పడుతున్నారు. రానున్న కాలంలోనూ మరింత మంది కళాకారులు ఇక్కడి షూటింగ్స్ జరుపుకోవడం ద్వారా స్థానిక కళాకారులకు సైతం అవకాశాలు వస్తాయనే ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక కళాకారులు సైతం తమకు అవకాశం కల్పిస్తే మరింత ప్రోత్సహించిన వారవుతారని భావిస్తున్నారు.
వేములవాడలో షూటింగ్స్ జరిగిన కొన్ని జానపదాలు..
‘రాను.. బొంబాయికి రాను’ అనే జానపద పాట వేములవాడలోనే షూటింగ్ జరుపుకుంది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.గున్నగున్న మామిండ్లు.. ఓ రాజులు
దత్తన్నవారింట్లో ధనమున్నదని..
మంజుల.. ఓ మంజుల
నిమ్మతోట వనంలో.. జోడు జబ్బల గొడుకు కింద..
చిన్నచిన్న చింతల్లో బావయ్యా..
ధన్‌ధనాదన్.. ధన్‌ధనాదన్
రాములా.. ఓ రాములా..
బావల్లో.. ఓ బావల్లో
రారా ముద్దుల బావయ్యో..
ఈ పాటలన్నీ వేములవాడ పట్టణంలోని వివిధ ప్రాంతాలు, ఆలయ పరిసరాలలో షూటింగ్స్ జరుపుకున్నాయి. ఈ పాటలన్నీ యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్ సంపాదించుకున్నాయి. ఇక్కడ షూటింగ్ జరిపితే హిట్ టాక్ వస్తుందనే విశ్వాసంతో చాలా మంది పాటలో కొంచెం పార్ట్ అయినా ఇక్కడ షూటింగ్ చేస్తున్నారని పలువురు కళాకారులు తెలిపారు.
షూటింగ్ హబ్‌గా మారనుంది
రాజన్న గుడితోపాటు పరిసర ప్రాంతాలు ప్రకృతి ప్రసాదించిన వనరులు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చాలా ప్రదేశాలు అందంగా ఉన్నాయి. ప్రభుత్వం కళాకారులకు సహకరిస్తే వేములవాడ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతుంది. నేను దాదాపు 150కి పైగా పాటలు ఈ ప్రాంతంలోని చిత్రీకరించాను. పదేళ్లుగా వెయ్యి పాటలకు తగ్గకుండా చిత్రీకరణ జరిగింది. బతుకమ్మ పాటలకు జిల్లాలోని గుట్టలప్రాంతాలు, పాతకట్టడాలు, చారిత్రాత్మక నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి.
– మారం ప్రవీణ్, పప్పి, యూట్యూబ్ కళాకారుడు, వేములవాడ
హిట్ అయ్యాయి
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే జానపద కళాకారులు ఎక్కువగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, రచయితలు, యూట్యూబ్ చానల్ ఓనర్స్ సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలోనే ఉన్నారు. పచ్చదనంతో ఆకట్టుకునే లొకేషన్స్ ఎక్కువగా మన ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి షూటింగ్ జరిగిన ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో తీసిన పాటలు చాలా వరకు హిట్టయ్యాయి.
– నాగలక్ష్మి, జానపద యూట్యూబ్ కళాకారిణి, సిరిసిల్ల