
ఈ మధ్య తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కోపాటకి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. పెళ్లి బరాత్ మొదలు ఏ ఈవెంట్‌కి వెళ్లిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన అని పాటలు ఒకెత్తు.. ‘రాను బొంబాయికి రాను..’ పాట మరో ఎత్తు. ఫోక్ సాంగ్స్‌లో ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు ఆ పాటకు రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో అటు వారిద్దరు ఫేమస్ అయిపోయారు. అయితే ఈ పాటకు చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా డ్యాన్సర్ లిఖిత క్లారిటీ ఇచ్చింది.
రెండు రోజుల షూటింగ్.. ఖర్చు ఎంతంటే..
రాము రాథోడ్ అన్నతో ముందుగా రెండు పాటలు అనుకున్నాం. ‘రాను బొంబాయికి..’ రెండో పాట. ఒక్క రోజులోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. ముందుగా ప్రొమో విడుదల చేశాం. అది బాగా వెళ్లింది. ఈ పాట కోసం చేసిన రీల్‌కి ఒకే రోజు మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేం కొన్ని మార్పులు చేశాం. పాట బాగా వెళ్లేలా ఉందని..రెండో రోజు వేరే చోట షూట్ చేశాం. అలా ఈ పాట కోసం మొత్తం రెండు రోజులు కేటాయించాం. ఇది హిట్ అవుతుందని తెలుసు కానీ..ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నా పేరు తెలియకపోయినా..‘రాను బొంబాయి రాను’ అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు.
రూ.కోటి వచ్చింది నిజమే కానీ..
ఈ పాటను రామ్ రాథోడ్ తన యూట్యూబ్ నుంచే రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది నిజమే. అయితే రామ్ రాథోడ్ అన్నయ్య విల్లా కొన్నాడు.. బెంజ్ కారు కొన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన ఏమి కొనలేదు. ఇక నా రెమ్యునరేషన్ విషయానికొస్తే.. రెండు రోజులకు ఎంత మాట్లాకున్నామో అంతే ఇచ్చేశాడు. భారీగా లాభం వచ్చింది కదా అని మేం ఎక్కువ అడగలేదు. ఎంత చెప్పారో అంతే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఇవ్వాలా వద్దా? అనేది వాళ్ల ఇష్టం. నేను అయితే ఏమి ఆశించడం లేదు. మేం పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని లిఖిత చెప్పుకొచ్చింది.
కాగా, ఈ పాటకు రాము రాథోడ్ లిరిక్స్ అందించడమే కాకుండా ప్రభతో కలిసి చక్కగా ఆలపించాడు కూడా. శేఖర్ వైరస్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకి కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. రామ్ రాథోడ్ తన సొంత డబ్బులతో ఈ పాటను తెరకెక్కించాడు.