breaking news
likitha
-
నేటి నుంచి మూడు ఐపీఓలు
ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో కళకళలాడుతోంది. గతవారమే మూడు కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ వారం... అదీ...నేటి(మంగళవారం) నుంచి మరో మూడు ఐపీఓలు (–మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్) సందడి చేయనున్నాయి. గతవారం ఐపీఓలకు మంచి స్పందన వచ్చినట్లే ఈ ఐపీఓలకు కూడా ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభించవచ్చని అంచనా. గురువారం (అక్టోబర్ 1న) ముగిసి వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే ఈ ఐపీఓలకు సంబంధించి మరిన్ని వివరాలు... మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇది. రూ.135–145 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ సైజు రూ.444 కోట్లు. కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేయాలి. లిస్టింగ్ లాభాలు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) 90 శాతం(రూ.125–130) రేంజ్లో ఉండటంతో లిస్టింగ్‌లో మంచి లాభాలు వస్తాయని నిపుణులంటున్నారు. యూటీఐ ఏఎమ్‌సీ ఈ వారంలో వస్తున్న అతి పెద్ద ఐపీఓ ఇదే. రూ.552–554 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,260 కోట్లు సమీకరించగలదని అంచనా. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.40–42 రేంజ్లో ఉంది. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్, గ్యాస్పైప్లైన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలందించే ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ. 117–120గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.20 రేంజ్లో ఉంది. -
బంగారు లక్ష్ములు
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మధురగా కల్పిత సుపరిచితమే. ఇప్పుడు చెల్లి లిఖిత ‘బంగారు పంజరం’తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది. బెంగుళూరులో పుట్టి తెలుగు బుల్లితెర ద్వారా ఆకట్టుకుంటున్న ఈ అక్కాచెల్లెళ్ల టీవీ ప్రయాణం గురించి వారి మాటల్లోనే.. ‘మా నాన్న బిల్డింగ్ కాంట్రాక్టర్. అమ్మ గృహిణి. అక్క, నేను.. ఇదీ మా కుటుంబం. అక్క కాలేజీ రోజుల్లో నటిస్తూనే పీజీ పూర్తి చేసింది. ‘ఒకరికి ఒకరు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కల్పిత కన్నడ సీరియల్స్‌లోనూ నటిస్తోంది. మా ఇంట్లో తను ఎంత చెబితే అంత. తనే నాకు అన్ని విషయాల్లో అడ్వైజర్. మోడల్. మంచితనమే ఆభరణంగా! ‘స్టార్ మా టీవీలో వచ్చే ‘బంగారు పంజరం’ సీరియల్లో మహాలక్ష్మిగా నటిస్తున్నాను. ఈ సీరియల్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. అమ్మానాన్నలు చనిపోవడంతో కుటుంబం అంతా తాత బ్రహ్మయ్య బొమ్మల తయారీమీద వచ్చిన ఆదాయంతోనే బతుకుతుంటుంది. తాత బొమ్మలతో పాటు చిన్న చిన్న నగలను కూడా తయారు చేసి అమ్ముతుంటాడు. పేదరికంలో ఉన్నా మా సంతోషాలకు ఎలాంటి లోటూ లేదు. ఒకసారి జమిందారీ కుటుంబం ఆ గ్రామంలోని దేవాలయంలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించడానికి పూనుకుంటుంది. అందుకు విగ్రహాలు, నగలు చేయమని ఆ పనిని మా తాతకు అప్పజెబుతుంది. పని అంతా పూర్తి చేస్తాడు మా తాత. ఇది గిట్టని వాళ్లు విగ్రహప్రతిష్టకు ముందు రోజు నన్ను కిడ్నాప్ చేస్తారు. రోజంతా ఒక ఇంట్లో ఉంచి, మరుసటి రోజు వదిలేస్తారు. అందరూ మహాలక్ష్మి శీలాన్ని శంకిస్తుంటారు. దీంతో తాత బ్రహ్మయ్య చాలా బాధపడతాడు. తమవల్ల బ్రహ్మయ్య కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఆ పేరు పోగొట్టడానికి తమ కంపెనీ మేనేజర్‌తో మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెబుతాడు జమిందార్. కానీ పెళ్లి సమయానికి ఆ మేనేజర్ పారిపోవడంతో జమిందారే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జమిందార్ ఇంట్లో ఇల్లాలిగా అడుగుపెట్టిన మహాలక్ష్మికి అప్పటికే అతనికి పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసి షాకవుతుంది. అలా బంగారు పంజరంలో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంది. ఎంతో అమాయకత్వం, మరెంతో మంచితనం గల అమ్మాయి మహాలక్ష్మి పాత్ర పోషిస్తున్నందుకు, ఇలా మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చదువంటేనే ఇష్టం అక్క నటిగా మారి నాకూ ఓ మార్గం వేసింది.. అని ఈ సీరియల్ ద్వారా అర్థమైంది. నాచేత ఫొటో షూట్స్ చేయించడం, ఫొటోగ్రాఫ్స్ సీరియల్ టీమ్స్‌కి పంపించడం.. అన్నీ తనే చూసుకుంది. అయితే, ముందు ఇదంతా నాకు తెలియదు. తను చేయమన్నట్టు చేసేదాన్ని. ఒక రోజు సీరియల్ టీమ్ అడుగుతున్నారు, అందులో యాక్ట్ చే యాలి అని తను నన్ను అడిగినప్పుడు చదువంటేనే ఇంట్రస్ట్ అని చెప్పాను. అవకాశాలు అందరికీ రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అని తనే నచ్చజెప్పింది. నా చదువుకి ఇబ్బంది లేకపోతే ఓకే అన్నాను. ఎందుకంటే ఇప్పుడు బీకామ్ సెకండియర్ చదువుతున్నాను. సీఎ చేద్దామన్నది నా ఫ్యూచర్ ప్లాన్. మా లెక్చరర్స్, ఫ్రెండ్స్‌ని కలిసి అక్కనే మాట్లాడింది. వాళ్లూ సపోర్ట్ చేస్తామన్నారు. అక్క నా పట్ల చూపిస్తున్న శ్రద్ధ కాదన లేక నటిగానూ ప్రూవ్ చేసుకుందామని ఇలా యాక్టింగ్ వైపు వచ్చాను. లలిత సంగీతం చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, పెయింటింగ్స్ వేయడం.. వీటి కోసం ఎన్ని గంటల సమయమైనా కేటాయిస్తాను. సింగర్‌గానూ రాణించాలని తొమ్మిదేళ్ల పాటు లలిత సంగీతం నేర్చుకున్నాను. అక్క మాటను కాదనలేక ఒక సీరియల్ అనుకున్నాను. కానీ, నటిగా రాణించడంలోనూ, ప్రూవ్ చేసుకోవడంలోనూ నూటికి నూరుపాళ్లు ఇన్వాల్వ్ అవుతున్నాను. ఇదే ఇకముందు నా ప్రపంచం అనిపిస్తోంది. ఇప్పుడు బాగుంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. నేనూ అక్కలా పీజీ చేసి ఈ ఇండస్ట్రీలోనే స్థిరపడాలని, మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాను. – ఆరెన్నార్ ఇద్దరిదీ ఒకే మాట మా ఇద్దరి అక్కచెల్లెళ్లది ఒకే మాట. ఇద్దరం సీరియల్స్ చూస్తాం. సీరియస్‌గా డిస్కషన్ చేస్తుంటాం. అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి, వారి క్యాస్ట్యూమ్స్ గురించి... ప్రతీది చర్చిస్తుంటాం. ఇద్దరం యాక్టింగ్ పీల్డ్‌లో ఉన్నాం కాబట్టి నటనలో మెలకువల గురించి, ఎలా చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో మాట్లాడుకుంటూ ఉంటాం. మా అమ్మానాన్నలు మా ఇద్దరి గురించి ఎవరితోనైనా చెప్పేటప్పుడు ‘మా ఇంటి బంగారు లక్ష్ములు’ అని గర్వంగా చెబుతుంటారు. -
లిఖిత కిడ్నాప్ కథ సుఖాంతం
గుంటూరు: ఎట్టకేలకు లిఖిత(13) కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. సుమారు రెండు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయిన లిఖిత నేడు తల్లిదండ్రులను చేరుకోనుంది. భట్టిప్రోలుకు చెందిన లిఖిత రెండు నెలల క్రితం కనిపించకుండా పోయింది. అయితే తమ కుమార్తెను నాగేశ్వరరావు అనే మాజీ బీఎస్ఎఫ్ జవాను కిడ్నాప్ చేసినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. పలు రాష్ట్రాల్లో గాలించిన పోలీసులకు కనిపించలేదు. చివరకు జమ్మూకాశ్మీర్‌లో లిఖితను గుర్తించిన పోలీసులు, బాలికతో సహా గుంటూరు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో లిఖితను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే నిందితుడు మాత్రం దొరకలేదని పోలీసులు తెలిపారు.