వేగం పుంజుకున్న ‘యాదాద్రి’  పనులు

YTDA Chairman Kishan Rao Inspected the Work of Yadadri Temple - Sakshi

ప్రధానాలయంలో ముమ్మరంగా నగిశీలు 

పూర్తి కావొస్తున్న శిల్పాలు

సివిల్‌ పనులూ వేగిరం

రోడ్ల విస్తరణపై అధికారుల ప్రత్యేక దృష్టి

పనులను పరిశీలించిన వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు

సాక్షి, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు శివాలయం, కొండ కింద చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. సీఎం కేసీఆర్‌ గతనెల 17న యాదాద్రిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన ఆదేశాలతో పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఫిబ్రవరిలో మహాయాగాన్ని చేపట్టి ప్రధానాలయంలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే. సీఎం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతోపాటు అధికారులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ప్రధానాలయం పనులను వేగవంతం కోసం అధికారులు, శిల్పులు శ్రమిస్తున్నారు. గర్భాలయం, ముఖమండపం, ఆలయంలో పంచనారసింహుల రాతి విగ్రహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గర్భాలయంలో కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేయగా మరికొన్నింటిని ప్రతిష్టించే పనిలో ఉన్నారు.

క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం పక్కన మెట్ల పనులు జరుగుతుండగా, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి విగ్రహాల ఏర్పాటు, ఆలయ నవీకరణ, ఫ్లోరింగ్, ప్రాకార మండపాలు, తిరుమాఢవీధుల్లో ఫ్లోరింగ్‌ పనులు జరుగుతున్నాయి. అష్టభుజి మండపాలపై శిల్పాలకు మెరుగుదిద్దడం, పంచతల రాజగోపురాలపై మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన సత్యనారాయణ వ్రతమండపం, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణ మండపం, అష్టభుజి ప్రాకారాల తుది మెరుగులతోపాటు ఆలయంలో విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. శివాలయం పనుల్లో కూడా వేగం పెంచారు. కొండపైన ఆలయం శిల్పాల పనులతో సమాంతరంగా సివిల్‌ పనులు చేస్తున్నారు. అలాగే కొండపైన వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. 

రహదారుల విస్తరణ పనులు..
యాదాద్రి ప్రధానాలయానికి నలుదిక్కులా రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు చేరుకునే రోడ్డు పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం పాతగుట్ట క్రాస్‌ రోడ్డు వద్ద నిలిచిపోయిన పనులను ప్రధానాలయం వరకు చేసే కార్యక్రమంలో అధికారులు బిజీబిజీగా ఉన్నా రు. రోడ్డు వెడల్పు చేయడంతోపాటు సెంట్రల్‌ లైటింగ్, ఇరువైపులా మొక్కలు నాటడం, రోడ్డును తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారు. రోడ్డు విస్తరణ విషయంలో బాధితులతో పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ వారికి ఆశిం చిన మేరకు లబ్ధి చేకూరడం లేదన్న ఆందోళనలో ఉన్నారు. నిర్వాసితులు తగిన నష్టపరిహారం  ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. 

కొత్త విద్యుత్‌ టవర్ల  ఏర్పాటు
రోడ్డు వెడల్పు సమయంలో విద్యుత్‌ టవర్లను ఏర్పాటు చేయడానికి ఆ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారి విస్తరణతో సమాంతరంగా టవర్లు ఏర్పాటు చేయడానికి ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమయ్యారు. అధికారులు భూసేకరణ చేసే సమయంలోనే టవర్ల కోసం స్థల సేకరణ చేయనున్నారు. 

దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణ పనులను మంగళవారం ఉదయం వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు పరిశీలించారు. గర్భాలయం, రాజగోపురాలు, ఆలయ తిరుమాడ వీధులు, ఇటీవల వచ్చిన జయ, విజయుల ద్వార పాలకుల విగ్రహాలను పరిశీలించారు. అక్కడి నుంచి శివాలయానికి వెళ్లి పనులను పరిశీలించారు. ముఖ, నవగ్రహ మండపాల పనులను సరిగ్గా నడుస్తున్నాయా ? లేదా అని ఆరా తీశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నంచి నూతనంగా నిర్మాణం జరుగుతున్న ప్రసాద విక్రయశాల నిర్మాణ భవనాలను సందర్శించారు. ప్రసాదాల తయారీకి సంబంధించి మరిని మషనరీలరావడంతో వాటి ఉపయోగం గురించి ఆయనకు తెలియజేశారు.  ప్రసాదాల తయారీకి సంబంధించిన 4అంతస్థుల భవనంలో ఏయే అంతస్థులో  ఏమేమి వస్తాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థపతి  ఆనందాచారి వేలు, ఆలయ ఈఓ గీతారెడ్డి, శిల్పులు మొగిలి, ఆదిత్య చిరంజీవి, పలువురు అధికారులు ఉన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top