ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే

YS Jagan School Friends Happy About Became CM - Sakshi

మా అందరికి ఆప్త మిత్రుడు

వారసత్వంగానే నాయకత్వ లక్షణాలు  

వైఎస్‌ జగన్‌పై మిత్రుల అభిప్రాయం  

ఏపీ సీఎం కాబోతుండడంపై హర్షం  

సాక్షి, సిటీబ్యూరో: నాయకత్వ లక్షణం అనేది వారసత్వంగానే వచ్చింది. అందుకే ఆయన చిన్నప్పటి నుంచే నాయకుడిగా ఎదిగాడు. అందరిలో ఉన్నా... ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. మా అందరి ఆప్త మిత్రుడు, క్లాస్‌మేట్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతున్నాడంటే. .మేమెంతో మురిసిపోతున్నాం’ అని బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి చదువుకున్న మిత్రులు పులకించిపోయారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివిన విద్యార్థులు అనేక మంది నేడు ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక పదవుల్లో ఉండగా... తాజాగా ఏపీ చరిత్రలోనే రికార్డు మెజారిటీతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న క్రమంలో ఆయన స్నేహితులంతా తమ ఆనందాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. హైదరాబాద్‌ నగరమంతా డిజిటల్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విద్య, వ్యాపార, క్రీడ, రాజకీయ రంగాల్లో పేరొందిన ఎంతోమంది చదువుకున్న హెచ్‌పీఎస్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1983లో 5వ తరగతిలో చేరి అక్కడే ప్లస్‌ టూ పూర్తి చేశారు. వైఎస్‌ జగన్‌తోనే చదువుకున్న సినీ నటుడు సుమంత్, సియాసత్‌ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ ఆమీర్‌ అలీఖాన్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి త్వరలోనే వైఎస్‌ జగన్‌తో ‘ఓల్డ్‌ స్టూడెంట్‌ మీట్‌’కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తో తమ చిన్ననాటి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు.

స్టూడెంట్‌ లీడర్‌
వైఎస్‌ జగన్‌ స్కూల్లోనే మా అందరికీ నాయకుడు. ఆయన నాగార్జున హౌస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తే నేను డిప్యూటీ హెడ్‌బాయ్‌గా పని చేశాను. నాకంత పని ఉండేది కాదు. కానీ హౌస్‌ కెప్టెన్‌ అనేది అత్యంత కీలకం. ఆ బాధ్యతలను జగన్‌మోహన్‌రెడ్డి సులువుగా నిర్వహించేవారు. ప్లానింగ్, కో–ఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్‌ ఫర్‌ఫెక్ట్‌గా ఉండేది. –  సుమంత్, సినీనటుడు  

ఆయనే గుర్తొస్తాడు.. జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు చూసేవాళ్లం. ఎమర్జెన్సీ వస్తే మాకు ఆయనే గుర్తొస్తాడు. సాదాసీదాగానే ఉంటూ అందరినీ కలుపుకుపోయేవాడు. అప్పుడే అనుకున్నాం.. గొప్ప నాయకుడు అవుతాడని. ఏపీ ప్రజల మద్దతుతో సీఎం అవుతుండడం సంతోషకరం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే జగన్‌ సైతం మైనారిటీలకు మంచి చేస్తాడన్న నమ్మకం ఉంది.– ఆమీర్‌ అలీఖాన్, సియాసత్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌

ఆల్‌రౌండర్‌ జగన్‌
మేం 5వ తరగతి నుంచి కలిసే చదువుకున్నాం. మేమిద్దరం బెంచ్‌మేట్స్‌ కూడా. నాగార్జున హౌస్‌ గ్రూప్‌ మాది. జగన్‌ శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఎప్పడూ గర్వం చూపేవారు కాదు. జగన్‌ పాఠశాల  విద్యార్థి దశ నుంచే గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారు. తరగతి హెడ్‌ బాయ్‌గా ఉండేవారు. ఆటలు, చదువులో ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపేవారు. స్నేహానికి అత్యంత విలునిచ్చే వ్యక్తి మా జగన్‌.  – కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, పారిశ్రామికవేత్త  

ఫుల్‌ హ్యాపీ...
మా పాఠశాల విద్యార్థి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతుండడం సంతోషంగా ఉంది. ఆయన జనరంజక పాలన అందిస్తూ అన్నివర్గాలకు మరింత మేలు చేస్తారని, రాష్ట్రాన్ని అగ్రస్ధానంలో నిలుపుతారనిఆశిస్తున్నాం.  – మర్రి ఆదిత్యారెడ్డి, పూర్వ విద్యార్థి   

రెండో సీఎం...
మా పాఠశాల నుంచి రెండో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచే మంచి నాయకత్వ లక్షణాలున్న జగన్‌ ఎప్పటికైనా పాఠశాల గర్వించే స్థాయికి ఎదుగుతాడని మేము అనుకునేవాళ్లం.  – ఫయాజ్‌ఖాన్,పూర్వ విద్యార్థి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top