సాగుబడి

Youth Services Department Letter To District Collectors Over Kitchen Garden At Schools - Sakshi

ప్రతి పాఠశాలలో కిచెన్‌ గార్డెన్‌.. టెర్రస్‌ గార్డెన్‌

కూరగాయలు.. పండ్ల తోటల పెంపకానికి నిర్ణయం

విద్యార్థులు, ఉపాధ్యాయులు, వార్డెన్ల భాగస్వామ్యం

తాజాగా జిల్లా కలెక్టర్లకు యువజన సర్వీసుల శాఖ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: తాజా కూరగాయలు.. ఆకు కూరలు. అప్పటికప్పుడు కోసి అక్కడికక్కడే వండుకొని తింటే ఆ రుచే వేరు. రసాయనాలు లేకుండా.. సేంద్రియ ఎరువులతో పండించే ఆహారం భుజిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఖర్చు కూడా ఆదా. ఇదే విధానాన్ని ఇకపై ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రతి బడిలో కిచెన్‌గార్డెన్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కల్తీ, నాసిరకం కూరగాయలు వండి వార్చుతుండటంతో బడి పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. పోషక విలువలు లేకపోవడంతో చిన్నారుల ఎదుగుదల, మేధస్సుపై విపరిణామం కనబరుస్తోంది.

అందుబాటులో పౌష్టికాహారం..
కూరగాయల ధరలు కూడా నింగినంటడం.. కొనుగోలు కూడా భారంగా మారడంతో విద్యాసంస్థల్లో దాదాపుగా ఒకటే మెనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో కిచెన్‌ గార్డెన్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి స్కూల్‌ ఆవరణలు, మిద్దెలపై (టెర్రస్‌ గార్డెన్‌) పండ్లు, కూరగాయల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. పోషకాల పాఠశాల–కిచెన్‌ గార్డెన్‌ (ఎన్‌ఎన్‌కేజీ) పేరిట పాఠశాలలు, ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్లలో వీటిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. తోటల పెంపకంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులతో కిచెన్‌ గార్డెన్లను విజయవంతంగా నడపాలని యోచిస్తోంది. రోజువారీ అవసరాలకు వాడే కూరగాయలతో పాటు పండ్ల మొక్కలను కూడా నాటాలని నిర్ణయించింది.

దీనికి అనుగుణంగా స్కూల్‌ ఆవరణలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశముంటే అందులో వీటిని అభివృద్ధి చేసేందుకు వినియోగించుకోవాలని నిర్దేశించింది. ఈ తోటల్లో పండే ఆహార ఉత్పత్తులను స్వీకరించడం వల్ల పోషకాలకు పోషకాలు.. తోటలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని.. విద్యా సంస్థలకు సరిపడా కూరగాయలు చౌకగా అందుబాటులో ఉంటాయని భావిస్తోంది. కేవలం విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డెన్లకే బాధ్యత అప్పగించకుండా.. వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోనుంది. మొక్కలు నాటేందుకు గుంతలు, భూమి చదును, సూక్ష్మ నీటి సేద్యానికి గ్రామీణ ఉపాధి హామీ, ఉద్యాన శాఖ సేవలను వినియోగించుకోనుంది. ఆయా కార్యక్రమాలను అమలు చేసేందుకు స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. జిల్లా యువజన సర్వీసుల అధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరించే ఈ పథకం.. కలెక్టర్‌ పర్యవేక్షణలో సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌ జిల్లా కలెక్టర్లకు తాజాగా లేఖ రాశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top