మీ భద్రత నాది | your security is my responsibility says sumathi in girls degree college | Sakshi
Sakshi News home page

మీ భద్రత నాది

Feb 6 2015 2:18 PM | Updated on Oct 8 2018 7:44 PM

మీ భద్రత నాది - Sakshi

మీ భద్రత నాది

‘జిల్లాలోని ప్రతి మహిళకు భద్రత కల్పించే బాధ్యత నాది.. అందుకోసం నేను.. నాతోపాటు నా టీం పనిచేస్తుంది. ఎవరైనా వేధిస్తే.. సమాచారం ఇవ్వండి..మిగతాది మేము చూసుకుంటాం’అని జిల్లా ఎస్పీ బి. సుమతి విద్యార్థినులకు సూచించారు.

  • ఇబ్బంది కలిగితే సమాచారం ఇవ్వండి
  •  తక్షణం చర్యలు తీసుకుంటా
  •  ఫేస్‌బుక్.. మెదక్ ఎస్పీ పేజీలోనూ ఫిర్యాదు చేయవచ్చు
  •  విద్యార్థినులకు ఎస్పీ సుమతి భరోసా
  •  సంగారెడ్డి మున్సిపాలిటీ:
     ‘జిల్లాలోని ప్రతి మహిళకు భద్రత కల్పించే బాధ్యత నాది.. అందుకోసం నేను.. నాతోపాటు నా టీం పనిచేస్తుంది. ఎవరైనా వేధిస్తే.. సమాచారం ఇవ్వండి..మిగతాది మేము చూసుకుంటాం’అని జిల్లా ఎస్పీ బి. సుమతి విద్యార్థినులకు సూచించారు. గురువారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘లైంగిక వేధింపులు.. నివారణ చర్యలు’ అంశంపై నిర్వహించిన అవగాహన   సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా మనలోనూ మార్పు రావాలన్నారు. ఇంటర్‌నెట్, స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్న యువత సంక్షిప్త సందేశాలతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకు వినియోగించుకోవాలని సూచించారు. అమ్మాయిలకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. లేకపోతే ఫేస్‌బుక్‌లో మెదక్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెదక్ ఎస్పీ పేజీని లైక్ చేసి సమస్య తెలిపితే  పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా రక్షణకోసం ఏర్పాటు చేసిన 08455-27655 నంబర్‌కు లేదా, 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఇక్కడ మహిళల సమస్యలను విని కౌన్సిలింగ్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారన్నారు. పోలీసులతో స్నేహభావం పెంపొందించుకునేందుకు ప్రతి నెలా మహిళ డిగ్రీ కళాశాల నుంచి 4 విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పంపించాలన్నారు. దానిద్వారా ఓ సమస్యను పోలీసులు ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకునే అవకాశం విద్యార్థినులకు కలుగుతుందన్నారు. జిల్లాలో మహిళలకు సంబంధించి 242 ఫిర్యాదులు రాగా, వాటిలో 80 శాతం కేసులను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించామన్నారు. విద్యార్థులు కళాశాలకు వచ్చి వెళ్లే క్రమంలో వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
     బాగా చదవండి.. నాలా పోలీస్ అవ్వండి ఎవరైనా సరే చదువుకుంటేనే అభివృద్ధి చెందుతారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని అప్పుడు ఉజ్వల భవిష్యత్  ఉంటుందని ఎస్పీ సుమతి కళాశాల విద్యార్థినులకు సూచించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, తాను కూడా మధ్యతర గతి కుటుంబంలో పుట్టానన్నారు. కష్టపడి చదువుకున్నందు వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. మీరు కూడా బాగా చదివి.. నాలా పోలీస్ అవ్వండని ఎస్పీ సూచించారు.

    అక్షరాస్యత  శాతం పెంచాలి
    అవగాహన సదస్సులో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు.  జిల్లాలో అక్ష్యరాస్యత శాతం 50గా ఉందని, అందువల్లే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. అందువల్ల ఇక్కడున్న విద్యార్థినులంతా తమ సమీపంలో ఉన్న వారు కూడా చదువుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అవసరమయ్యే పనులకు వాడుకోవాలన్నారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కుటుంబ సభ్యులకు, లేదా అధ్యాపకులకు చెప్పాలని సూచించారు. అప్పుడే లైంగిక వేధింపుల బారిన పడకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్ సమీరా నజ్మీన్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, యువజన సంఘాల నాయకుడు వేణుగోపాల్, గోపిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement