Sakshi News home page

‘గుట్ట’ చైర్మన్‌గా కేసీఆర్!

Published Sat, Feb 28 2015 1:38 AM

Yadagirigutta chairman kcr

సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట  ఆలయాభివృద్ధి సంస్థకు సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఆయన చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.కిషన్‌రావు వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉంటారు. సభ్యులుగా భువనగిరి ఎంపీ, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు, పురపాలక, ఆర్థిక, దేవాదాయ శాఖల ముఖ్యకార్యదర్శులు, నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, నల్లగొండ డీఎఫ్‌ఓ ఉంటారు. సంస్థ పాలకవర్గంలో అదనంగా మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులుంటారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థ (టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
 
 ఆలయాభివృద్ధి పనుల కోసం తక్షణమే రూ.100 కోట్లు మంజూ రు చేస్తున్నట్టు వాటిలో పేర్కొన్నారు. ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలును ఇకపై ఆయనే నేరుగా పర్యవేక్షిస్తారు. వారంలో ఒకసారి సంస్థ పాలకవర్గాన్ని సమావేశపరిచి ఆలయాభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకే ఆయన ఈ కమిటీని వేశారని అధికార వర్గాలు తెలిపాయి. కేసీఆర్ నేతృత్వంలో గుట్ట ఆలయాభివృద్ధి సంస్థ ఏర్పాటు కానుందని పేర్కొంటూ గత డిసెంబర్ 26న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇవ్వడం తెలిసిందే. గుట్ట ఆలయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్, నాలుగంచెల్లో దాని అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
 
 దాంతో ఆలయాభివృద్ధి సంస్థ ఏర్పాటుపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు జరిపి రెండు నెలల కింద ప్రతిపాదనలు పంపింది. ఆలయం చుట్టూ ఉన్న 6 గ్రామాల్లోని సుమారు 28 వేల ఎకరాల  పరిధిలో ఆలయాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలంటూ అది చేసిన ప్రతిపాదనలను కేసీఆర్ శుక్రవారం ఆమోదించారు. దాంతో ఆ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి, గుండ్లపల్లి, సైదాపూర్, దాతర్‌పల్లితో పాటు భువనగిరి మండలం రాయగిరి తదితర గ్రామాల పరిధిలోని 28 వేల ఎకరాలు ఆలయాభివృద్ధి సంస్థ పరిధిలోకి వచ్చాయి. ఇలా సేకరించే స్థలాల్లో నారసింహ అభయారణ్యంతో పాటు ఔషధ మొక్కల పెంపకం, భక్తులకు కాటేజీలు, కల్యాణ మండపం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు.

Advertisement
Advertisement