పట్టు పరిశ్రమాభివృద్ధికి కృషి

Work for silk development - Sakshi

మల్బరీ రైతులకు సబ్సిడీ పెంపునకు కృషి: ఈటల  

తుంపర, బిందు సేద్యం కోసం రూ.900 కోట్లు

సింగాపూర్‌లో 12 జిల్లాల పట్టు రైతుల అవగాహన సదస్సు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మల్బరీసాగు, పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని పౌర సరఫరాలు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీని పెంచి దేశంలో మల్బరీ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచేలా చేస్తామని చెప్పారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో మల్బరీ సాగు, డ్రిప్‌ ఇరిగేషన్‌పై 12 జిల్లాల రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

వ్యవసాయం చేసి అప్పులపాలు కాకుండా రైతుబంధు ద్వారా ఆర్థిక సహాయం, రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. పట్టు పురుగుల పెంపకంలో సాంకేతికపరమైన మార్పులు వచ్చాయని హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లిలో రైతు నర్ర స్వామిరెడ్డి రూ.3 లక్షలు ఖర్చు చేసి మల్బరీ సాగులో రూ.10 లక్షల ఆదాయం పొందారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తుమ్మనపల్లి మరో అంకాపూర్‌లా ఆదర్శం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ శాతం వ్యవసాయానికే కేటాయించామని తెలిపారు. బిందు సేద్యానికి 100 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అమర్చుతున్నామని గ్రీన్‌ హౌజ్‌ కల్టివేషన్‌కు 30 లక్షల సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. డ్

రిప్, స్ప్రింక్లర్ల సేద్యానికి రూ.900 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మున్ముందు పట్టు ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, చొప్పదండి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యేలు బొడిగ శోభ, వొడితెల సతీశ్‌కుమార్, హార్టీకల్చర్, సెరీకల్చర్‌ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రాంరెడ్డి, మదన్‌మోహన్, హార్టీకల్చర్‌ డీడీ శ్రీనివాస్, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, 12 జిల్లాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top