చిరు ధాన్యం.. ఆరోగ్యభాగ్యం

Womens farmers consciousness under DDS - Sakshi

డీడీఎస్‌ ఆధ్వర్యంలో మహిళారైతుల చైతన్యం

 సేంద్రియ విధానంలో చిరు ధాన్యాల సాగు

ప్రారంభమైన పాత పంటల జాతర  

జహీరాబాద్‌: అంతరించి పోతున్న చిరు ధాన్యాల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహించడమే లక్ష్యంగా డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) ఆధ్వర్యంలో చేపట్టిన పాతపంటల జాతర రెండు దశాబ్దాలుగా నిరంతరంగా సాగుతోంది. సోమ వారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అర్జున్‌నాయక్‌ తండాలో 20వ పాత పంటల జాతరను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ప్రారంభించారు. జహీరాబాద్‌ మండలం రంజోల్‌లో 1999లో డీడీఎస్‌ ఈ జాతరకు శ్రీకారం చుట్టింది. నాటినుంచి ఏటా వివిధ గ్రామాల్లో జాతరను నిర్వహిస్తూ వస్తోంది. ఇలా ఇప్పటికి వంద గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించింది.

డీడీఎస్‌ డైరెక్టర్‌ పి.వి.సతీశ్‌ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో మహిళలను చిరు ధాన్యాల సాగువైపు ప్రోత్సహిస్తున్నారు. ఎకరం, రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు చిరు ధాన్యాలను సాగు చేస్తూ వస్తున్నారు. ఏడాదిపాటు వారి ఆహార అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వచేసుకుని, మిగతా ‘చిరు’ధాన్యాన్ని డీడీఎస్‌ సంస్థకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర కంటే 20 శాతం ఎక్కువ ధర చెల్లించి ఈ సంస్థ రైతులనుంచి పంటలను కొనుగోలు చేస్తోంది.  ధాన్యాన్ని సంస్థ తరఫున హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మొబైల్‌ వాహనాల ద్వారా సైతం అమ్ముతున్నారు.  

సేంద్రియ వ్యవసాయమే లక్ష్యంగా.. 
సేంద్రియ వ్యవసాయమే లక్ష్యంగా  ఐదువేల మంది  మహిళా రైతులు చిరు ధాన్యాలను పండిస్తున్నారు.  ఇలా సాగుచేసిన చిరు ధాన్యాల పంటలకు అంతగా తెగుళ్లు సోకవని అంటున్నారు. పెట్టుబడులు అంతగా అవసరం ఉండవని, వర్షాభావాన్ని సైతం తట్టుకుని చిరు ధాన్యాలు పండుతాయని చెబుతున్నారు.  చిరు ధాన్యాలను మిశ్రమ పంటలుగా సాగుచేసుకుంటున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 30 రకాల పంటలను కలిపి  సాగుచేస్తున్నారు.

రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా తమకు అవసరమైన విత్తనాలను నిల్వ చేసి ఉంచుతారు.   జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్‌కల్‌ మండలాల్లోని 68 గ్రామాల్లో విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు.  ఖరీఫ్‌లో మినుము, పెసర, కంది, సజ్జ, పచ్చజొన్న, రబీ కింద శనగ, తెల్ల కుసుమ, సాయిజొన్న, అవుశ, వాము పంటలను అధికంగా సాగు చేస్తున్నారు.  తైదలు, కొర్రలను కూడా సాగు చేస్తున్నారు.

రైతులకు అవగాహన  
ఈ ఏడాది పాత పంటల జాతర సోమవారం ప్రారంభమైంది. ఉత్సవాలను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ .. చిరు ధాన్యాల సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరోగ్యాన్నిచ్చే చిరు ధాన్యాలను ప్రతి ఒక్కరూ తినేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇది శుభ పరిణామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 వరకు 24 గ్రామాల్లో జాతరను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు, ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. నిపుణులచేత పంటల సాగు, సేంద్రియ వ్యవసాయంతో కలిగే ఉపయోగాల గురించి వివరిస్తారు. జాతర సందర్భంగా 16 ఎడ్ల బండ్లలో చిరు ధాన్యాలను ప్రదర్శిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top