మహిళా శక్తిని మేల్కొలుపుతూ.. 

women writer guntupalli kalavathi success story - Sakshi

వృత్తి, ప్రవృత్తిలో రాణిస్తున్న ఉపాధ్యాయురాలు 

సమాజంలో సమానత్వం కోసం పోరాటం

జనగామ అర్బన్‌: జనగామ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వృత్తిలో రాణిస్తునే సమాజాన్ని మేల్కొలిపేలా కవితలు రచిస్తూ తోటి మహిళకు స్ఫూర్తినిస్తున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన గుంటిపల్లి కళావతి చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించింది.  సమాజంలో ఆడపిల్లలపై వివక్షను గుర్తించింది. రాజ్యాంగంలోని హక్కులపై బాలికలు, మహిళల్లో అవగాహన కల్పిస్తేనే గానీ ‘మహిళా సాధికారత’ సిద్ధిస్తుందని తెలుసుకుంది. ఇందుకోసం సమాజాన్ని చైతన్యం చేసే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. 2000 సంవత్సరంలో బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరింది. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూనే తన రచనలతో విలువైన సందేశాలను ఇస్తోంది.  

సంపాదకురాలిగా.. 
సమాజంలో స్త్రీ స్థానానికి ఉన్న గౌరవాన్ని వివరించే ప్రయత్నంలో భాగంగా ‘అన్వేషణ’, ‘ఆమెను చూసారా..!’ పేర్లతో వంద కవితలను రచించింది. ‘అధ్యాపక జ్వాల’ పత్రికకు సంపాదకురాలిగా పనిచేస్తూ పలు పుస్తకాల ఆవిష్కరించింది. డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌లో రాష్ట్ర కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోంది. బాలల హక్కులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తోంది.ఉత్తమ సేవలకు గానూ కళావతికి 2013లో లయన్స్‌ క్లబ్‌ వారు ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును అందజేశారు. అలాగే, 2016, 2017లో సావిత్రిబాయి పూలే అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఆమె జనగామ మండలం లింగాలఘణపురం మండలం నవాబుపేట హైస్కూల్‌లో విధులు నిర్వర్తిస్తోంది.  

హక్కులపై అవగాహన పెరగాలి 
మహిళలు హక్కులపై అవగాహన పెంచుకోవాలి. న్యాయం వైపు ధైర్యంగా నిలబడాలన్న స్పృహ కలిగినప్పుడే మహిళా సాధికారతకు అర్థం ఉంటుంది. సమాజంలో లింగ వివక్షను రూపుమాపాలి. మహిళలకు హాని కలిగించే ఏ చర్యలను ప్రోత్సహించొద్దు. 
గుంటిపల్లి కళావతి, ప్రభుత్వ ఉపాధ్యాయులురాలు
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top