నకిలీ బంగారంతో బ్యాంకు రుణం

Women Take Loan With Fake Gold Jewellery In Karimnagar - Sakshi

దుర్శేడ్‌ సింగిల్‌విండోలో అఫ్రైజర్‌ మోసం

మేనేజరు తనిఖీలో వెలుగుచూసిన వైనం

సాక్షి. కరీంనగర్‌ రూరల్‌: నకిలీ బంగారాన్ని సహకార సంఘంలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్న అఫ్రైజర్‌ నాలుగేళ్ల నుంచి తిరిగి చెల్లించలేదు. మొండిబకాయిల వసూళ్ల కోసం వచ్చిన అధికారులు రుణాల జాబితాను పరిశీలించగా అఫ్రైజర్‌కు రుణం ఇవ్వరాదని పేర్కొంటూ, బంగారాన్ని తనిఖీ చేసి నకిలీదిగా గుర్తించారు. చివరకు అఫ్రైజర్‌ రుణం చెల్లించడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ వ్యవహారం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో సంఘం పాలకవర్గం, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌ సహకార సంఘంలో శ్రీరామోజు కృష్ణమాచారి కొన్నేళ్లనుంచి అఫ్రైజర్‌గా పనిచేస్తున్నాడు.

సంఘంలో బంగారు నగలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేటప్పుడు బంగారం నాణ్యతను పరిశీలించి కృష్ణమాచారి నివేదిక ప్రకారం రుణం మంజూరు చేస్తారు. ఈ క్రమంలో కృష్ణమాచారి 2015లో సంఘంలో బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.44వేలు, 2016లో రూ.95 వేలు రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకునుంచి పలుమార్లు నోటీస్‌లు జారీ చేశారు. మార్చి నెలాఖరులోపు మొండి బకాయిలను వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో సోమవారం ఖార్ఖనగడ్డ కేడీసీసీ బ్రాంచ్‌ మేనేజరు లావణ్య సంఘాన్ని సందర్శించి రుణాల జాబితాను పరిశీలించారు. అఫ్రైజర్‌కు నిబంధనల ప్రకారం రుణం ఇవ్వరాదని, కృష్ణమాచారికి రుణం ఎలా ఇచ్చారంటూ బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు.

అఫ్రైజర్‌ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలించగా నకిలీగా తేలడంతో కృష్ణమచారిని కార్యాలయంలోకి పిలిపించి విచారణ చేశారు. అఫ్రైజర్‌గా ఉండి నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రుణం చెల్లించకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరకు రుణం చెల్లిస్తానంటూ ఒప్పుకోవడంతో విడిచిపెట్టారు. మంగళవారం బ్యాంకు సిబ్బంది కృష్ణమాచారికి సంబంధించిన అసలు బంగారాన్ని కరీంనగర్‌లోని ఖార్ఖనగడ్డ బ్రాంచ్‌లో తాకట్టుపెట్టి రుణం ఇప్పించారు. అనంతరం సంఘానికి బకాయిపడిన రుణం అసలు, వడ్డీ మొత్తం రూ. 2.40లక్షలను వసూలు చేయడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బంగారం తాకట్టు పెట్టుకుని అఫ్రైజర్‌కు రుణం ఇవ్వరాదనే విషయం తెలియక కృష్ణమచారికి ఇచ్చామని, నకిలీ బంగారం కాదని, నగల్లో నాణ్యత లేదని సంఘం సీఈవో ఆంజనేయులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top