ఆకాశంలో సగం.. కానీ.. ఇక్కడ కాదు..!

Women No Priority In Legislatures Telangana - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: సమాన అవకాశాలు.. మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇది వినేందుకు బాగున్నా.. చట్టసభల్లో మహిళలకు మాత్రం సరైన అవకాశాలు రావడం లేదనే భావన వ్యక్తమవుతోంది. ఆకాశంలో సగమంటున్నా.. రాజకీయంగా చైతన్యం కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చట్టసభలకు ఎంపికవుతున్న మహిళల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2004, 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మహిళలు లేకపోగా.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపికై జిల్లా రాజకీయ చైతన్యానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చారు.

1957 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి జిల్లాలో వివిధ రాజకీయ పక్షాల నుంచి మహిళలు పోటీ చేయడం.. వారిలో కొందరు విజయం సాధించి.. తమ హక్కులపై చట్టసభల్లో వాణి వినిపించి రాజకీయ చతురతను ప్రదర్శించిన ఘనత అనేక మంది ఎమ్మెల్యేలకు ఉంది. శాసనసభ నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.లక్ష్మీకాంతమ్మ విజయం సాధించి.. జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అప్పుడు కీలక నేతగా వ్యవహరించి.. తర్వాత మూడుసార్లు ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. 1972లో జరిగిన సాధార ణ ఎన్నికల్లో మధిర నుంచి కాంగ్రెస్‌ తరఫున దుగ్గినేరి వెంకటరావమ్మ విజయం సాధించి.. మహిళల సమస్యలపై గళం విప్పిన నేతగా గుర్తింపు పొందారు. తర్వాత రెండు, మూడుసార్లు శాసనసభకు ఎన్నికలు జరిగినప్పటికీ ఒకరిద్దరు మహిళలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసినా విజయం సాధించలేదు.
  
ఆ తర్వాత రేణుక.. 

ఇప్పటివరకు ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున టి.లక్ష్మీకాంతమ్మ మూడు పర్యాయాలు విజయం సాధించగా.. అదే రాజకీయ పరంపరను కొద్దికాలం తర్వాత కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కొనసాగించారు. 1999లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేణుక అప్పట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమెపై టీడీపీ తరఫున జిల్లాలో డీఆర్‌డీఏలో పనిచేస్తున్న మద్దినేని బేబి స్వర్ణకుమారి పోటీ చేశారు. తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన స్వర్ణకుమారి, రేణుకాచౌదరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఆ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు ఆయాచితం నాగవాణి కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ నుంచి రేణుకాచౌదరి విజయం సాధించారు. 2009 ఎన్నికల నాటికి జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వామపక్షాలతో సహా అన్ని రాజకీయ పక్షాలు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో వైరా నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన బానోతు చంద్రావతి విజయం సాధించగా.. భద్రాచలంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కుంజా సత్యవతి గెలుపొందారు.

దీంతో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలు అయిన ఘనత ఉమ్మడి జిల్లాకు దక్కింది. ఇక నామినేటెడ్‌ పదవుల విషయానికొస్తే.. మద్దినేని బేబి స్వర్ణకుమారి రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా కొద్దికాలం పనిచేశారు. 2014లో పాలేరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన స్వర్ణకుమారి, ఇల్లెందు నుంచి పోటీ చేసిన బాణోతు హరిప్రియ, కాంగ్రెస్‌ తరఫున భద్రాచలం నుంచి పోటీ చేసిన కుంజా సత్యవతి ఓటమి చెందగా.. అప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బానోతు చంద్రావతికి సీపీఐ టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరి వైరా నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో నలుగురు మహిళలు పోటీ చేయగా.. ఈసారి ఆయా రాజకీయ పక్షాలు ఎంతమందికి అవకాశం కల్పి స్తాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. 

అవకాశమివ్వని ‘గులాబీ’.. 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో మహిళలకు చోటు దక్కలేదు. ఇక కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఈసారి మహిళలు ఎక్కువగానే ఉన్నారు. ఖమ్మం నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, అశ్వారావుపేట నుంచి సున్నం నాగమణి, బానోతు పద్మావతి, పినపాక నుంచి అజ్మీరా శాంతి, ఇల్లెందు నుంచి బానోతు హరిప్రియ వంటి నేతలు ఈసారి టికెట్లు ఆశిస్తున్నారు. ఇక పాలేరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు మద్దినేని బేబి స్వర్ణకుమారి మరోసారి ప్రయత్నం చేస్తుండగా.. గత ఎన్నికల్లో భద్రాచలం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ ప్రభుత్వ అధికారి ఫణీశ్వరమ్మ ఈసారి ఏపీ నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సత్తుపల్లి నుంచి సీపీఎం మహిళా అభ్యర్థి గా మాచర్ల భారతిని అధికారికంగా ప్రకటించింది. ఈసారి బీజేపీ తరఫున ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఉప్పల శారద టికెట్‌ ఆశిస్తుండగా.. వైరా నుంచి బీజేపీ తరఫున సినీ నటి రేష్మా, భద్రాచలం నుంచి కుంజా సత్యవతి టికెట్‌ ఆశిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున కర్రెద్దుల కమలకుమారి విజ యం సాధించి, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుంచి టీడీపీ ఎంపీగా మేరీ విజయకుమారి విజ యం సాధించారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పక్షాల నుంచి మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యం లభించిందన్న సంతృప్తి ఉన్నా.. ఇదే సంప్రదాయం ప్రతి ఎన్నికల్లోనూ కొనసాగడం లేదన్న అసంతృప్తి ఆయా రాజకీయ పార్టీల్లోని మహిళా నేతల్లో కొంత నెలకొంది.

స్థానిక సంస్థల్లో ఇలా.. 
స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికి మూడుసార్లు ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని మహిళలు చేపట్టారు. 1980లో జెడ్పీ చైర్‌పర్సన్‌గా భద్రాచలంకు చెందిన వాణి రమణారావు పనిచేయగా.. 2008 జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలు పొందిన గోనెల విజయలక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వెంకటాపురం నుంచి గెలుపొందిన గడిపల్లి కవిత టీడీపీ తరఫున జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికై.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్‌ తరఫున రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందగా.. అనారోగ్య కారణాలతో ఆయన మరణించడంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్‌ తరఫున సుచరితారెడ్డి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. 2007లో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి సీపీఎం తరఫున బుగ్గవీటి సరళ పోటీ చేసి ఓటమి చెందారు. అలాగే 2009లో ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తరఫున చండ్ర అరుణ పోటీ చేయగా.. పాలేరు నుంచి ఝాన్సీ పోటీ చేశారు. 2014లో అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా న్యూడెమోక్రసీ తరఫున సంధ్య ఎన్నికల బరిలోకి దిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top