ఆటోలో మహిళ ప్రసవం

Women Delivered in Auto And Child Death Hyderabad - Sakshi

మలక్‌పేట ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఘటన

నవజాత శిశువు మృతి

వైద్యులు పట్టించు కోలేదని బాధితుల ఆరోపణ

ఆరోపణలు అవాస్తవం: ఆర్‌ఎంఓ మల్లికార్జునప్ప

మలక్‌పేట: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చి ఓ నిండు గర్భిణి  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆటోలోనే ప్రసవించిన సంఘటన మలక్‌పేట ఏరియా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తితే ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ జాఫర్‌ భార్య సబా ఫిర్ధోస్‌(28)కు పురిటి నొప్పులు రావడంతో జాఫర్‌ బుధవారం అర్ధరాత్రి ఆటోలో ఆమెను ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బం ది ఆమెకు తక్షణ వైద్యం  అందించకుండా బయటే నిలబెట్టడంతో ఆమె ఆటోలోనే ప్రసవించింది. అయితే పుట్టిన వెంటనే శిశువు మృతి చెందింది. సరైన వైద్యం అందించనందునే శిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది ఆమెను లోపలికి తీసుకెళ్లి వైద్యసేవలు అందించారు. దీనిపై సమాచారం అందడంతో చాదర్‌ఘాట్‌ పోలీసులు సంఘట పా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

వైద్యుల నిర్లక్ష్యమే కారణం: : షేక్‌ జాఫర్, సబా ఫిర్ధోస్‌ భర్త
నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని అర్థరాత్రి ఆసుపత్రికి తీసుకొచ్చినా వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆటోలోనే ప్రసవించింది. ఆసుపత్రి సిబ్బంది, నిర్లక్ష్యం కారణంగా శిశువు చనిపోయింది. కనీసం మందులు, ఇంజక్షన్‌ కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

వైద్యుల నిర్లక్ష్యం లేదు: సూపరింటెండెంట్‌  డాక్టర్‌ బద్రినాథ్‌
సబా ఫిర్ధోస్‌ వైద్య పరీక్షల నిమిత్తం తరచూ ఆసుపత్రికి వస్తోంది. ఈనెల 16న కూడా చెకింగ్‌ కోసం ఆసుపత్రి రాగా బీపీ ఎక్కువగా ఉండటంతో పేట్లబురుజు ఆసుపత్రికి రెఫర్‌ చేయడం జరిగింది. 17న ఆమె ఆసుపత్రికి వచ్చింది. పేట్ల బురుజు ఆసుపత్రికి వెళ్లినా రద్దీ ఉన్నందున తిరిగి వచ్చినట్లు చెప్పింది. అయితే అదే రోజు అర్థరాత్రి నొప్పులు రావడంతో ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు, సిబ్బంది ఆమెకు చికిత్స అందించారు. నెలలు నిండక పోవడంతో శిశువు మృతి చెందాడు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం లేదు. మహిళకు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నాం, ఆరోగ్యం నిలకడగా ఉంది. 

ఆరోపణలు అవాస్తవం: ఆర్‌ఎంఓ మల్లికార్జునప్ప
రాత్రి డ్యూటీలో ఉన్న  డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోలేదనడం పూర్తిగా అవాస్తవం. 16న ఓపీకి వచ్చినప్పుడు బేబీకి నెలలు నిండలేదని, బీపీ కూడా ఎక్కువగా ఉందని చెప్పాం. పేట్లబురుజు ఆసుపత్రిలో గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని అక్కడికి వెళ్లాలని సూచించాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top