సమాజం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా... మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వరకట్న చావులు ఆగడంలేదు.
సమాజం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా... మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వరకట్న చావులు ఆగడంలేదు. నిత్యం ఏదో ఒక చోట వరకట్నం బాధితులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం మండలంలోని గొల్లపల్లిలో వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
- చింతపల్లి
మండల పరిధిలోని మర్రిగూడ మండలం ఖుధాభక్ష్‌పల్లికి చెందిన పాలకుర్ల పద్మయ్య, లక్ష్మమ్మ రెండో కుమార్తె శివలీల (24)ను గొల్లపల్లి గ్రామానికి చెందిన అల్వాల నారయ్య, ముత్తమ్మల కుమారుడు అల్వాల జంగయ్యకు గత నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. వివాహ సమయంలో నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. మొదట మూడు లక్షలు ముట్టజెప్పి వివాహ అనంతరం మిగిలిన లక్ష ఇస్తామని పెళ్లి జరిపించారు. అయితే అట్టి డబ్బులకోసం భర్త జంగయ్య, శివలీల అత్త ముత్తమ్మలు తరచూ కోడలిని వేదింపులకు గురి చేసేవారు. పలుమార్లు పంచాయితీకూడా పెట్టారు. నెలకిందట డబ్బులు తీసుకొని రావాలని తల్లిగారింటికి పంపించి రోజు ఫోన్లో మానసికంగా వేదించేవారు. ఈ నేథప్యంలో సోమవారం రాత్రి శివలీలను కట్నం తీసుకరావాలని భర్త చితకబాదాడు.
అవమానం భరించలేని వివాహిత మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిదిచూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పొగలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు తెరచిచూడగా అప్పటికే శివలీల మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించా రు. బంధువులు, చుట్టు పక్కల వారిని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వరకట్నం వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
భర్త, అత్తలే కడతేర్చారు : మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
శివలీల వివాహం అయిన రెండు నెలల నుంచే కట్నం కోసం భర్త జంగయ్య, అత్త ముత్తమ్మలు వేధించేవారని, కట్నం విషయమై తమ బిడ్డ ఇంటికొచ్చి గోడు వెళ్లబోసుకునేదని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. పలుమార్లు పెద్దమనుషులు నచ్చజెప్పిటినప్పటికీ కూతురు ప్రాణం పోయేవరకు వదిలిపెట్టలేదని కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెను అత్త, భర్తలే కడతేర్చారని వారు ఆరోపించారు. ఇదిలావుండగా శివలీల ఆత్మహత్య సంఘటన జరిగినప్పటినుంచి అత్తా, భర్తలు పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది.