లేడీ కిలాడి.!

Woman Cheated In Name Of Gulf Jobs At Gollapalli In Rajanna Siricilla - Sakshi

దోహఖత్తార్‌ పంపిస్తానని పదిమంది నుంచి రూ.8లక్షలు వసూలు

కనిపించకుండా పోయిన మహిళ గల్ఫ్‌ ఏజెంట్‌

లబోదిబోమంటున్న బాధితులు

సాక్షి, గొల్లపల్లి (సిరిసిల్ల): ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్‌ వెళ్లాలనుకున్న ఆ యువకుల ఆశలు అడియాశలయ్యాయి. ‘నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, దోహఖత్తర్‌ పంపిస్తా, మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా’ అని నమ్మబలికింది ఓ మాయ లేడీ. తమ ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా అని పది మందికిపైగా ఆ మాయలేడీని నమ్మి డబ్బు ముట్టజెప్పారు. ఈక్రమంలో ఆ లేడీ తన భర్తతో పాటు ఉడాయించింది. ఆరా తీసినా దొరక్కపోవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. నమ్మితే ఇంత మోసం చేసిందని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లొత్తునూర్‌ గ్రామానికి చెందిన అప్పని దస్తగిరి కొంత కాలం క్రితం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ పద్మ అనే యువతితో పరిచయమయింది. ఆమెది వైజాగ్‌ కాగా ప్రేమవివాహం చేసుకున్నారు.

భార్యాభర్తలిద్దరు కొద్ది రోజులు లొత్తునూర్‌లో గడిపారు. ఇక్కడ స్థానిక యువకులతో పరిచయం ఏర్పడింది. గల్ఫ్‌ వెళ్లేందుకు తనకు నమ్మకమైన ఏజెంట్‌ ఉన్నాడని తాను దోహఖత్తర్‌లో మంచి కంపెనీలో మంచి వేతనం వచ్చేల చూస్తాడని గల్ఫ్‌ వెళ్లేందుకు ఆసక్తి ఉన్న పలువురు యువకులతో పద్మ నమ్మబలికింది. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన దావన్‌పెల్లి పవన్, ఎండీ ఫరూక్‌(బీర్‌సాని), ఉప్పుల రమేశ్, రాచకొండ గంగాధర్, మైదర్‌ తిరుపతి, జక్కుల శ్రావణ్‌కుమార్, సింగం నరేశ్, బోడకొండ చిలుకయ్య, పాశిగామ నరేశ్, మంథని దేవేందర్‌తో పాటు పలువురి నుంచి దాదాపు రూ.8లక్షల వరకు వసూలు చేసింది. కొందరు రూ.80వేలు, మరికొందరు రూ. 30, 20వేలు ఇలా పదిమందికి పైగా ముట్టజెప్పారు.

కొందరి వద్ద రూ.80 వేలు తీసుకున్నట్లు బాండ్‌ పేపర్‌ను 2018 అక్టోబర్‌ 2వ తేదీన రాసి ఇచ్చింది. 2018 అక్టోబర్‌ 12 గల్ఫ్‌ పంపిస్తానని, పంపించకపోతే 15వ తేదీన ఎవరి డబ్బులు వారికి ఇస్తానని నమ్మించి బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చింది. వారు నమ్మేలా డూప్లీకేట్‌ వీసా సైతం చూపించింది. మరుసటి రోజునుంచి కనిపించకుండా పోయింది. బాధితులు వైజాగ్‌లోని ఆమె ఇంటికి వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. తామే కాకుండా వెల్గటూర్‌ మండలంలో కూడా బాధితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మోసం చేసిన పద్మపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని దావన్‌పల్లి పవన్‌ తండ్రి అంజయ్య, ఫరూక్, ఉప్పుల రమేశ్‌ తదితరులు కోరుతున్నారు. ఆమె కోసం ఎంత తిరిగినా ప్రయోజనం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top