వన్యప్రాణుల అరణ్య రోదన!

Wild Animals Deaths In Nehru Zoological Park Hyderabad - Sakshi

పదుల సంఖ్యలో మూషిక జింకల మరణం  

కారణాలను అన్వేషించని అధికార గణం

పోస్టుమార్టం రిపోర్టులు బుట్టదాఖలు  

సింహం కూన మృతిపై కేసు నమోదు

డాక్టర్లున్నా.. అందని వైద్య సేవలు  

బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్‌ పార్కులో వరుసగా అరుదైన వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. సంవత్సరం పొడవునా వన్యప్రాణుల జననం 10 వరకు ఉంటే.. మృతిచెందుతున్నవి మాత్రం 70– 100 ఉంటున్నాయి. ఎక్కువ శాతం అనారోగ్యం, వృద్ధాప్యంతో మృతి చెందినట్లు జూ ఉన్నతాధికారులు పేర్కొంటూ చేతులు దులుపుకొంటున్నారు. గత నవంబర్‌లో ఏడాదిన్నర వయసున్న బహిస్మతి సింహం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇది పిల్లకూన కావడంతో అనారోగ్యాన్ని సాకుగా చూపకుండా జూ అధికారులు దీని మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓ వ్యక్తి పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి సాకి అనే పులిని చంపిన కేసు మొదటిది కాగా... సింహం కూన అనుమానంపై కేసు రెండోది. మొత్తంగా జూపార్కులో అరుదైన వన్యప్రాణుల మృతికి జూ అధికారుల నిర్లక్ష్యం, యానిమల్‌ కీపర్ల సలహాలు, సూచనలను పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వన్యప్రాణుల బలిగొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

కారణాలేమిటి..  
నెహ్రూ జూలాజికల్‌ పార్కులో వరుసగా మృతి చెందుతున్న వన్యప్రాణులకు అసలు కారణాలను ఆదిలోనే గుర్తించడంలో జూ వెటర్నరీ వైద్యులు విఫలం చెందడం ప్రధానమైన కారణం. సీజనల్‌గా వచ్చే వ్యాధుల పేరుతో తీసుకుంటున్న ముందస్తు చర్యలు నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువగా తీసుకోవడం. ఆయా వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లో నీటి మోడ్‌ను పరిశుభ్రపరచకపోవడం, బ్యాక్టీరియా వ్యాపించకుండా సున్నం కలిపిన బ్లీచింగ్‌ పౌడర్‌ను 15 రోజులకోసారి చల్లడం, మోడ్‌లోకి కొత్త నీరు విడుదల చేయకపోవడంతో చల్లిన బ్లీచింగ్‌ పౌడర్, సున్నం మరింత కలుషితం కావడంతో ఆ నీటిని తాగి వన్యప్రాణులు కాలేయం, ఊపిరితిత్తులతో పాటు గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. 

వైద్య సేవలు అంతంతే..
జూలోని ఆయా ఎన్‌క్లోజర్‌లో ఉన్న వన్యప్రాణులను పరిశీలిస్తూ వైద్య సేవలను జూ అధికారులు అంతంత మాత్రంగానే అందిస్తుండటంతో వన్యప్రాణులు మృత్యు చెందుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యానికి గురైన వన్యప్రాణులకు వైద్యం అందించాలంటే జూ కన్సల్‌టెంట్, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ సూచనలు, సలహాలు తీసుకోవాల్సింది. ఆయా వన్యప్రాణుల నీటి నమునాలను సేకరించి కాలుష్యాన్ని గుర్తించే చర్యలు చేపట్టకపోవడం, యానిమల్‌ కీపర్లు వన్యప్రాణులకు నివేదికలను జూ వెటర్నరీ వైద్యులు బుట్టదాఖలు చేయడంతో ఎక్కువ సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణులకు అందిస్తున్న ఆహారాన్ని పూర్తిగా పరిశీలించడంలోనూ వెటర్నరీ వైద్యులు విఫలం చెందడంతో వన్యప్రాణులు అనారోగ్యానికి గురవుతున్నాయి.  

నివేదికలేవీ..   
జూపార్కులో మృతి చెందిన వన్యప్రాణులకు పోస్టుమార్టం నిర్వహించి నమునాలను సేకరించి మృతికి కారణాలను తెలియజేయాల్సిన జూ అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. సింహం కూన మృతి నివేదికను ఇప్పటి వరకు వెల్లడించలేదు. గత నెల 29న మృతి చెందిన సింహం నివేదికను రెండు రోజుల్లోనే జూ అధికారులు పత్రికలకు విడుదల చేయడం గమనార్హం. గత ఏడాది అడవిదున్న, నీటి గుర్రం, ఐనా, నీటి కుక్క, సారస్‌ క్రేన్‌ పక్షి, చింపాంజీ, ఎలుగుబంటి, మూషిక జింకలు, నామాల కోతులు, చిరుత పులులు, పెద్ద పులులు, సింహాలు, ఏనుగు, వివిధ రకాల కోతులతో పాటు ఇతర వన్యప్రాణులకు పోస్టుమార్టం నిర్వహించిన సీసీఎంబీ, వీబీఆర్‌ఐ, జూ వెటర్నరీ, రాజేంద్రనగర్‌ వెటర్నరీ వైద్యులు, శాస్త్రవేత్తలు మృతికి కారణాలపై ఇచ్చిన నివేదికలను ఇప్పటి వరకు వెల్లడించకపోవడం జూ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.  

పదుల సంఖ్యలో మూషిక జింకల మృతి..
సెంట్రల్‌ జూ అథారిటీ సహకారంతో అంతరించిపోతున్న మూషిక జింకల సంతానోత్పత్తిని జూలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అనతి కాలంలోనే మూషిక జింకల సంతానోత్పత్తిలో సత్ఫలితాలను సాధించారు. మూషిక జింకల సంతానోత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోవడంతో వాటికి వేరే ఇతర ప్రదేశాలను కేటాయించకపోవడంతో మూషిక జింకలు అంతర్గతంగా పోట్లాకు దిగి 12 వరకు మృతి చెందడం గమనార్హం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top