ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్
డెయిర్–అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): పెద్దన్న పాత్రలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉత్తదేనని తేలిపోయింది. బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యమైందన్న సాకు చూపి ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై భీకర స్థాయిలో దాడులతో తెగబడింది. సంధి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ మంగళవారం రాత్రి మొదలెట్టిన భూతల, గగనతల దాడుల్లో ఇప్పటిదాకా 104 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
అక్టోబర్ 10న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో దాడులు, ఇంతటి మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో పశ్చిమాసియాలో హమాస్ సాయుధులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయని స్పష్టమైంది. ఇష్టారీతిగా దాడులు చేసి 104 మందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకివచ్చిందని ప్రకటించడం గమనార్హం.


