తొలి ఏడాది రూ.25 లక్షలు
మరుసటి ఏడాది రూ.50 లక్షలు
కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: దేశం ప్రధాన రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరిగితే, మరణాలు సంభవిస్తే ఆ రోడ్‌ను నిర్మించిన కాంట్రాక్టర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హైవేలపై ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్మించు, నిర్వహించు, బదలాయించు(బీవోటీ) విధానంలో నిర్మించిన జాతీయ రహదారులపై నిర్దేశిత మార్గంలో ఒక ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే, సదరు కాంట్రాక్టర్లను బాధ్యులను చేసి, జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి.
బీవోటీ డాక్యుమెంట్‌ను సవరించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి వి.ఉమాశంకర్ చెప్పారు. ఒక ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటే.. అవి పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్లు క్రాష్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. 500 మీటర్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్లు రూ.25 లక్షల జరిమానా చెల్లించాలన్నారు. మరుసటి ఏడాది కూడా ప్రమాదాలు జరిగితే ఈ జరిమానా రూ.50 లక్షలకు పెరుగుతుందని స్పష్టంచేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 3,500 ప్రాంతాలను
గుర్తించినట్లు వి.ఉమాశంకర్ తెలిపారు.
నగదు రహిత చికిత్స పథకం
జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధానంగా మూడు విధానాల్లో నిర్మిస్తున్నారు. అవి బీవోటీ, హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హామ్), ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్(ఈపీసీ). బీవోటీ విధానంలో రోడ్డు నిర్మాణం, నిర్వహణ గడువు 15 నుంచి 20 ఏళ్ల దాకా ఉంటుంది. హామ్ విధానంలో గడువు 15 ఏళ్లు. గడువు పూర్తయ్యేలోగా మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్‌దే. దేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వి.ఉమాశంకర్ వెల్లడించారు. బాధితులు మొదటి ఏడు రోజులపాటు రూ.1.5 లక్షల విలువైన నగదు రహిత చికిత్సను పొందవచ్చని కేంద్రం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలియజేసింది. ఇలాంటి చికిత్సలను తొలుత 2024 మార్చి 14న చండీగఢ్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.


