మా నేతే గెలుస్తడు!

Who Will Be Win In Telangana Elections - Sakshi

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు

రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు

హోరాహోరీ స్థానాలపై మరింత ఆసక్తి

నిఘావర్గాలు, ప్రైవేట్‌ సర్వేలపైనా దృష్టి

పరిస్థితిపై ఆరా తీస్తున్న బెట్టింగ్‌ బాబులు

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్రంలో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కీలకంగా మారాయి. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? పెరిగిన పోలింగ్‌ శాతంతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అన్న చర్చ జోరందుకుంది. ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానుండగా.. ఆ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వస్తాయనే దానిపై బెట్టింగ్‌లు కూడా ఊపందుకున్నాయి. ఎగ్జిట్‌పోల్, పోస్ట్‌పోల్‌ సర్వేలు గందరగోళం సృష్టిస్తుండగా.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్లతోపాటు జగిత్యాల, మంథనిలో ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్ల, రామగుండం, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్‌ ఫలితాలపైనా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా.. మిగతా 12 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలను ప్రజాకూటమి, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలిచేదెవరు..? ఓడేదెవరు..?
గెలుపు ఓటములపై ఎవరి ప్రభావం ఎంత..? అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. 

పోరు ప్రతిష్టాత్మకం.. గెలుపుపై ప్రశ్నార్థకం.. లెక్కలు, విశ్లేషణల్లో ప్రధాన పార్టీలు..
ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికివారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ జోరందుకుంది. విశ్లేషణలు, సర్వేలు అటూఇటుగా వస్తున్నా.. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ప్రశ్నార్థకంగా మారాయి. 13 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి జరిగిన ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే సాగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయం నల్లేరుపైనడకగా భావించిన స్థానాల్లో కూడా అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కొన్నట్లు నిఘావర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణలే ఇందుకు కారణంగా చెప్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు చెప్తుండగా.. బయట ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా అన్నిస్థానాల్లోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుందని చెబుతున్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌ సరళి, ఇంటలిజెన్స్, ఎగ్జిట్‌పోల్‌ నివేదికలు ముందరేసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలు, విశ్లేషణలతో గెలుపోటముల అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. పోలింగ్‌ సరళిపై ఆరా తీస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బూత్‌కమిటీ సభ్యులుగా వ్యవహరించిన పార్టీ కార్యకర్తలతో సమీక్ష చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో గెలుపుపై జోరుగా సమీక్షలు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. 

జోరుగా సర్వేలు, విశ్లేషణలు.. అన్ని స్థానాల్లో బెట్టింగ్‌లు..
ఉమ్మడి కరీంనగర్‌లోని అన్నిస్థానాలపైనా సర్వేలు, విశ్లేషణలు జోరందుకున్నాయి. మరో రెండురోజుల్లో ఫలితాలు వెలువడనుండగా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. హుజూరాబాద్, సిరిసిల్ల, మంథని, జగిత్యాల, కరీంనగర్‌ అసెంబ్లీ స్థానాల ఫలితాలపైన ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆయా పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఇక్కడ అభ్యర్థులుగా ఉండటమే ఇందుకు కారణం. ఈటల రాజేందర్‌ ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా.. హుజూరాబాద్‌లో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారన్న చర్చ రెండురోజులుగా జోరందుకుంది. సిరిసిల్లలో కేటీఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేకే. మహేందర్‌ రెడ్డి కూడా అదేస్థాయిలో పోటీ ఇచ్చారన్న ప్రచారం ఆ రెండు పార్టీల కేడర్, అభిమానుల్లో బెట్టింగ్‌లకు కారణమవుతోంది. కరీంనగర్‌ నుంచి మూడోసారి బరిలోకి టీఆర్‌ఎస్‌ నుంచి దిగిన గంగుల కమలాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బండి సంజయ్‌కుమార్‌ (బీజేపీ) మధ్య పోటీ రసవత్తరంగా సాగిందన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. 

మంథని నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్సెస్‌ పుట్ట మధుకర్, జగిత్యాలలో కాంగ్రెస్‌ దిగ్గజం టి.జీవన్‌రెడ్డి వర్సెస్‌ సంజయ్‌కుమార్‌ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా సాగడంపై ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ విప్‌గా పనిచేసిన కొప్పుల ఈశ్వర్‌ (టీఆర్‌ఎస్‌)కు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (కాంగ్రెస్‌) ధర్మపురిలో గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. మానకొండూరులో రసమయి బాలకిషన్‌ (టీఆర్‌ఎస్‌), ఆరెపెల్లి మోహన్‌ (కాంగ్రెస్‌), చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌), సుంకె రవిశంకర్‌ (టీఆర్‌ఎస్‌), బొడిగ శోభ (బీజేపీ), వేములవాడలో చెన్నమనేని రమేశ్‌బాబు (టీఆర్‌ఎస్‌), ఆది శ్రీనివాస్‌ (కాంగ్రెస్‌), కోరుట్లలో కె.విద్యాసాగర్‌రావు (టీఆర్‌ఎస్‌), జె.నర్సింగరావు (కాంగ్రెస్‌), పెద్దపల్లిలో దాసరి మనోహర్‌ రెడ్డి (టీఆర్‌ఎస్‌), సీహెచ్‌.విజయరమణారావు (కాంగ్రెస్‌), రామగుండంలో సోమారపు సత్యనారాయణ (టీఆర్‌ఎస్‌), కోరుకంటి చందర్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌), రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పోటాపోటీగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందన్న కోణంలో ఆయా పార్టీల అభ్యర్థుల అభిమానులు, కార్యకర్తలు బెట్టింగ్‌లకు దిగుతుండటంపై అందరూ చర్చించుకుంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top