పరిష్కారమైన వివాదంపై అప్పీల్‌ ఏమిటి?

What is the appeal on the settlement issue? - Sakshi

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీపై హైకోర్టు ఆగ్రహం.. రూ.లక్ష జరిమానా  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైన ఓ వివాదంపై మళ్లీ అప్పీళ్లు దాఖలు చేసిన నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలను భూస్థాపితం చేసేలా ఇటువంటి పనికిరాని వ్యాజ్యాలను దాఖలు చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేసినందుకు ఆ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ జిల్లాలో జరిగిన లోక్‌ అదాలత్‌లో పెంటమ్మ, యేసమ్మ తదితరులకు పరిహారం చెల్లించేందుకు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అంగీకరించింది. దీంతో లోక్‌ అదాలత్‌ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సదరు బీమా కంపెనీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, లోక్‌ అదాలత్‌లో ఉత్తర్వులు జారీ చేసే సమయంలో తమ అధికారుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించింది. ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top